Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసంపూర్ణ ఒప్పందం
- ముగిసిన గ్లాస్గో సదస్సు
గ్లాస్గో : గ్లాస్గోలో పదిహేను రోజులపాటు సాగిన కాప్ 26 సదస్సు శనివారంతో ముగిసింది. కర్బన ఉద్గారాల తగ్గింపు బాధ్యత, గ్రీన్ టెక్నాలజీ, పరిహార నిధి వంటి కీలక అంశాలపై ధనిక, పేద దేశాల మధ్య విభేదాలు తొలగించేందుకు వాతావరణ సదస్సు నిర్ణీత గడువును ఒక రోజు పెంచాల్సి వచ్చింది. వనరులను కొల్లగొట్టడంలోను, కాలుష్యం వెదజల్లడంలోను ముం దుండే సంపన్న దేశాలు కర్బన ఉద్గారాల తగ్గింపులో, పరిహారం చెల్లింపులో బాధ్యత తీసుకోకుండా శుష్కవాగ్దానాలతో సరిపెట్టాయి. సమయం లేదు, భూ ఉష్ణోగ్రతల ముప్పు ముంచుకొస్తోందంటూ అసంపూర్ణ ఒప్పందంపై వర్థమాన దేశాలపై ఒత్తిడి తెచ్చి సంతకాలు చేసేలా చూడడంలో సఫలమయ్యాయి. చివరి నిమిషంలో బొగ్గుపై భారత్, చైనా చేసిన కీలక మార్పులను ఒప్పందంలో జోడించాయి.. గ్రీన్ ఎనర్జీకి మారడానికి, వాతావరణ ప్రతికూలతలవల్ల జరిగే నష్టం భర్తీకి, అలాగే వాతావరణ సంక్షోభ నివారణ చర్యలు చేపట్టేందుకు తమకు ఏటా 1.3 లక్షల కోట్లు కావాల్సి ఉంటుందని వర్థమాన దేశాలకు చెందిన జి-77 కూటమి, చైనా పేర్కొన్నాయి. ఈ వనరులన్నీ అభివృద్ది చెందిన దేశాల నుంచే రావాలన్నాయి. దీనిపై విభేదాలు అలాగే వున్నాయి. ధనిక దేశాలు రెట్టింపు స్థాయిలో మొదట తగ్గించుకోవాలి. గ్రీన్ టెక్నాలజీపై గుత్తాధిపత్యం వదులుకోవాలన్న డిమాండ్‌పై పారిశ్రామిక దేశాల నుంచి సష్టమైన హామీ రాబట్టడంలో వర్థమాన దేశాలు విఫలమయ్యాయి. శిలాజ ఇంధనాలపైనే చాలా వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయి. ఆఫ్రికా దేశాలను తగ్గించుకోవాలని జి-7 దేశాలు కోరుతున్నాయి. . తగ్గించుకోడానికి వాటి దగ్గర ఏముంది. వాతావరణ మార్పుల వల్ల ఎక్కువనష్టాలు ఎదుర్కొంటున్నది ఈ దేశాలే. పెద్ద కాలుష్యకారక దేశాలు ఎక్కువ బాధ్యత తీసుకుని తగ్గించుకోకుండా ఇతర దేశాలను తగ్గించుకోమని ఒత్తిడి చేశాయి. ధనిక దేశాలు రెట్టింపు స్థాయిలో కర్బన ఉగ్గారాలు తగ్గించుకుంటే తాము కూడా అందుకు సిద్ధమని వర్థమాన దేశాలు తేల్చిచెప్పాయి. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు ధనిక దేశాలు ఎలాంటి నిర్దిష్ట హామీలు ఇవ్వనందున కర్బన ఉద్గారాల తగ్గింపు దశలవారీగా జరగాలని భారత్, చైనా సూచించాయి. ఈ సూచనను మొదట అంగీకరించేందుకు నిరాకరించిన అభివృద్ధి చెందిన దేశాలు చివరికి కొంచెం మెత్తబడ్డాయి.
'శిలాజ ఇంధనాలను బాధ్యతాయుతంగా ఉపయోగించు కునే అర్హత'ను అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిగి ఉన్నాయని భారత పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ తన వాదనను వినిపించారు. అభివృద్ధి చెందిన దేశాలు, ధనిక దేశాల్లోని 'స్థిరమైన జీవన శైలి, వ్యర్థమైన వినియోగ విధానాలే' గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధానంగా కారణమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా శిలాజ ఇంధనాలను నిర్మూలించడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాధ్యం కాదని భారత మంత్రి చెప్పారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి లక్ష్యాలు ఈ దేశాల అజెండాగా ఉందని చెప్పారు. భూఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి, తదుపరి కార్బన్ కోతలపై చర్చించడానికి దుబారులో 2023లో సమావేశం కావాలని సభ్య దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.