Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాప్ సదస్సు ఫలితంపై పెదవి విరుపు
పారిస్ : శనివారంతో ముగిసిన కాప్ సదస్సు ఫలితంపై చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదని ప్రముఖ పర్యావరణ ప్రచారకర్త గ్రెటా థన్‌బెర్గ్ వ్యాఖ్యానించారు. కాగా ముంచుకొస్తున్న ప్రకృతి విపత్తు మెడపై కత్తిలా వేలాడుతోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ హెచ్చరించారు. శనివారం జరిగిన కాప్ సదస్సు పేరుకు మాత్రమే పొడిగింపు అని, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని థన్‌బెర్గ్ అన్నారు. గ్లాస్గోలో కుదిరిన ఒప్పందాన్ని స్వాగతించినా, చేయాల్సిన పని చాలానే వుందని ఆమె పేర్కొన్నారు. ఒప్పందంలోని లొసుగులు లోపాలను గుటెరస్ వివరించారు. కాప్ సదస్సులో వచ్చిన ఫలితం చూస్తుంటే రాజీ పడినట్లు కనిపిస్తోందన్నారు. ఇందులో నెలకొన్న ప్రయోజనాలు, రాజకీయ వైరుధ్యాలు, కొరవడిన సంకల్పం వంటివన్నీ ఈ ఒప్పందంలో ప్రతిబింబిస్తున్నాయని ట్వీట్ చేశారు. ఇది కీలకమైన చర్యే కానీ తగినంత రీతిలో లేదని వ్యాఖ్యానించారు. 'దుర్బలత్వంతో కూడిన మన భూగోళం సన్నని దారానికి వేలాడుతోందని' ఆయన హెచ్చరించారు. 'కాప్ సదస్సు ఫలితంతో మీరు నిరాశ చెంది వుండవచ్చు, కానీ మన జీవితాల కోసం మనం పోరాడాలి, ఈ పోరాటంలో మనం విజయం సాధించాలి' అని యువతను, ఆదివాసులను, మహిళా నేతలతో సహా వాతావరణ చర్యలకై పోరుసల్పిన వారిని ఉద్దేశిస్తూ గుటెరస్ మరో సందేశాన్ని ట్వీట్ చేశారు. 'కాప్ సదస్సు ముగిసింది. దాని ఫలితం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదని' థన్‌బెర్గ్ ట్వీట్ చేశారు. తమ మాటలకు, వాస్తవిక చర్యలకు పొంతన వుండేలా చూడడంలో ప్రపంచ నేతలు విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.