Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైడెన్‌కు స్పష్టం చేసిన జిన్‌పింగ్
- స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం
- పోటీ అనేది ఘర్షణగా మారకుండా చూసుకోవాలన్న బైడెన్
- కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదని వెల్లడి
బీజింగ్/వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మంగళవారం ఉదయం (బీజింగ్ సమయం) వీడియో సమావేశం జరిపారు. ఈ సమావేశంలో వ్యూహాత్మక అంశాలు, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, మొత్తంగా విస్తృతాంశాలపై చర్చలు జరిపారు. ఇరువురు నేతలు ముఖాముఖి జరిపిన మొదటి ఆన్లైన్ సమావేశం దాదాపు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. స్నేహపూర్వక వాతావరణంలోనే చర్చలు ప్రారంభమయ్యాయి. బైడెన్ తనకు పాత మిత్రుడేనంటూ జిన్‌పింగ్ గుర్తు చేసుకున్నారని, తన పాత స్నేహితుడిని చూడడం తనకు చాలా సంతోషంగా వుందని వ్యాఖ్యానించారని చైనా సెంట్రల్ టెలివిజన్ విడుదల చేసిన వీడియో పేర్కొంది. ఉమ్మడి సవాళ్ళను పరిష్కరించడంలో ఇరు దేశాలు కలిసి కృషి చేయడం చాలా కీలకమని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశం చైనాకు పనివేళల్లోనే జరిగినా, అమెరికాకు మాత్రం అర్ధరాత్రి సమయంలో జరిగింది. దాంతో ఈ సమావేశం కోసం ఎవరు ఆతృతగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతోంది. ద్వైపాక్షిక సంబంధాలను ఏకపక్షంగా నిర్వచించే అమెరికా శకం ముగిసింది. రెండు దేశాలు సమాన హోదాలో, సక్రమంగా చర్చలు జరిపే దశలోకి ఇరు దేశాలు ప్రవేశించాయని పెకింగ్ యూనివర్శిటీలో చైనా-అమెరికా సంబంధాల నిపుణుడు వాంగ్ డాంగ్ వ్యాఖ్యానించారు.
కలిసి ముందుకు సాగాలి
చైనా, అమెరికా రెండూ అభివృద్ధికి సంబంధించి కీలకమైన దశల్లో వున్నాయని చైనా అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా, భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా చైనా, అమెరికా కమ్యూనికేషన్‌ను, సహకారాన్ని పెంచుకోవాల్సిన అవసరం వుందని జిన్‌పింగ్ బైడెన్‌కు స్పష్టం చేశారు. ఎవరికి వారు దేశీయ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూనే అదే సమయంలో తమ వంతు అంతర్జాతీయ బాధ్యతలను కూడా తలకెత్తుకోవాల్సి వుందని అన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్ళేందుకు కలిసి కృషి చేయాలని కోరారు. రెండు దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ఇరు దేశాల మధ్య స్థిరమైన సంబంధాలు నిలకడగా కొనసాగాల్సిన అవసరం వుందని జిన్‌పింగ్ చెప్పారు. శాంతియుతమైన, సుస్థిర అంతర్జాతీయ వాతావరణాన్ని పరిరక్షించాల్సి వుందన్నారు. వాతావరణ మార్పులు, కోవిడ్ మహమ్మారి వంటి అంతర్జాతీయ సవాళ్ళకు సమర్ధవంతమైన పరిష్కారాలను కనుగొనాల్సి వుందన్నారు. ''చైనా-అమెరికా పరస్పర గౌరవించుకోవాలి. శాంతియుతంగా సహజీవనం సాగించాలి. పరస్పర సహకారాన్ని అందచేసుకోవాలి'' అని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఏకాభిప్రాయ సాధనకు బైడెన్‌తో కలిసిపనిచేయడానికి సిద్ధంగా వున్నానని చెప్పారు. సానుకూల దిశలో చైనా-అమెరికా సంబంధాలను ముందుకు తీసుకెళ్ళేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలన్నారు.
మూడు సూత్రాలు, నాలుగు ప్రాధాన్యతా రంగాలు
ఇరు దేశాల మధ్య సంబంధాలకు మూడు సూత్రాలను, నాలుగు ప్రాధాన్యతా రంగాలను జిన్‌పింగ్ పేర్కొన్నారు. ముందుగా ఇరు దేశాలు పరస్పరం అనుసరిస్తున్న సామాజిక వ్యవస్థలను, అభివృద్ధి పంథాలను గౌరవించుకోవాల్సిన అవసరం వుందని స్పష్టం చేశారు. ఒకరి కీలక ప్రయోజనాలను, ప్రధాన ఆందోళనలను మరొకరు గౌరవించాలన్నారు. అభివృద్ధి చెందే హక్కును ఒకరికొకరు గౌరవించుకోవాలన్నారు.
ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు : బైడెన్
ఆ మేరకు చర్యలు తీసుకోండి : జిన్‌పింగ్
గతంలో మాదిరిగా ''నిష్కపటమైన, ముక్కుసూటి చర్చలు'' జరిపేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు బైడెన్ చెప్పారు. ''మన దేశాల మధ్య పోటీ అనేది ఘర్షణగా మారకుండా వుండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇరువురు నేతలకు వుందని అన్నారు. మన విభేదాల పట్ల స్పష్టంగా, నిజాయితీగా వుండాలన్నారు. పరస్పర ప్రయోజనం కలిగిన అంశాలపై కలిసి కృషి చేయాలన్నారు. కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని అమెరికా కోరుకోవడం లేదని బైడెన్ స్పష్టం చేశారు అయితే ఇందుకు సంబంధించి నిర్దిష్ట చర్యలను బైడెన్ తీసుకుంటారని ఆశిస్తున్నట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు.
మూడు హామీలిచ్చిన బైడెన్
చైనా వ్యవస్థను మార్చాలని కోరుకోమని, చైనాతో ఘర్షణ పడే ఉద్దేశ్యం లేదని, చైనాకు వ్యతిరేకంగా తమ పొత్తులు వుండబోవంటూ బైడెన్ మూడు హామీలిచ్చారు. కాగా అమెరికా తన హామీలను నిలబెట్టుకోవాలని జిన్‌పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విభేదాలను పరిష్కరించుకుని, సున్నితమైన అంశాలను నిర్మాణాత్మకమైన రీతిలో పరిష్కరించుకోవాల్సి వుందని ఇరు దేశాలు భావించాయి. తద్వారా చైనా-అమెరికా సంబంధాలు పక్కదారి పట్టకుండా కాపాడుకోవాల్సి వుందన్నారు.
తైవాన్‌పై అమెరికాను హెచ్చరించిన చైనా
తైవాన్‌పై సంయమనం పాటిస్తున్నామని, శాంతియుత పునరేకీకరణ కోసం నిజాయితీగా కృషి చేస్తున్నామని జిన్‌పింగ్ చెప్పారు. అయినా వేర్పాటువాద శక్తులు తమను రెచ్చగొడితే, రెడ్‌లైన్ దాటాల్సిన పరిస్థితి తెస్తే, కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దానిపై బైడెన్ స్పందిస్తూ ఒకే చైనా అన్న అమెరికా విధానాన్ని పునరుద్ఘాటించారు.