Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : గాజాను పాలిస్తున్న, పాలస్తీనా ఉద్యమం మిలటరీ విభాగమైన అల్ ఖసమ్ బ్రిగేడ్ (హమస్)ను నిషేధించాలని బ్రిటన్ భావిస్తోంది. బ్రిటన్‌లో 2001 మార్చి నుంచి ఈ సంస్థపై నిషేధం వుంది. అయితే అమెరికా, యురోపియన్ మాదిరిగానే బ్రిటన్‌లో కూడా తీవ్రవాద చట్టం-2000 కిందకు ఈ నిషేధాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్టు బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. కాగా, అధికార ప్రకటన వచ్చిన తర్వాతనే తాము స్పందిస్తామని హమాస్ అధికారి తెలిపారు. 1987లో స్థాపించబడిన హమస్, పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయిల్ ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. నిషేధం అమల్లోకి వస్తే, హమాస్‌కు మద్దతు తెలిపినా, జెండాను ఎగురవేసినా, ఆ సంస్థ కోసం సమావేశాలు జరిపినా అవన్నీ కూడా చట్ట ఉల్లంఘల కిందకే వస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంటెలిజెన్స్ సమాచారం, తీవ్రవాదానికి సంబంధించిన సమాచారం ఆధారంగానే ఈ నిషేధపు ఆలోచనలు సాగుతున్నాయని బ్రిటీష్ హోం మంత్రి ప్రీతి పటేల్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్ పర్యటనలో వున్నారు. అక్కడే ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వుంది. వచ్చే వారం ఈ మేరకు పత్రాలను పార్లమెంట్‌కు అందచేస్తారు. కాగా ఇజ్రాయిల్ ఈ చర్యను స్వాగతించింది.