Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో వారి ఉపాధిపై తీవ్ర ప్రభావం
- పురుషులతో పోల్చుకుంటే అధిక నష్టం
- ప్రతి రంగంలోనూ ఇదే తీరు
- ప్రపంచవ్యాప్తంగా జీడీపీలో పెరుగుదల
- కానీ, వారి ఉపాధి రికవరీ నిరాశజనకం : ఐఎల్ఓ-2020 సమాచారం
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ప్రతికూల మార్పులు అన్నీ ఇన్నీ కావు. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అట్టడుగు దేశాల వరకూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఈ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇక ఉద్యోగ, ఉపాధి నష్టాలు వర్ణనాతీతం. వ్యాపార, వాణిజ్య, ఐటీ, పారిశ్రామిక, పర్యాటక.. ఇలా రంగమేదైనా ఉపాధి దెబ్బ మాత్రం తీవ్రంగా చూపింది. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా, ఈ ప్రభావం పురుషులతో పోల్చుకుంటే మహిళల పైనే అధికంగా పడింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) వెల్లడించింది. అయితే, ప్రపపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ కాస్త మునుపటిస్థాయికి చేరుకుంటున్నట్టు కొన్ని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచ దేశాల జీడీపీలో పెరుగుదల కనిపిస్తున్నది. అయితే, ఈ ఉపాధి సంక్షోభం కుదుటపడుతున్నదనుకుంటున్న సందర్భంలో మాత్రం మహిళలు వెనకబడిపోయారని ఐఎల్ఓ వివరించింది.
నాలుగుశాతానికి పైగా పడిపోయిన ఉపాధి
ఐఎల్ఓ-2020 నివేదిక అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ పురుషులతో పోల్చుకుంటే మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మహిళా కార్మికుల్లో దాదాపు సగం మంది అధిక, మధ్యస్థ-అధిక ప్రమాదం కల రంగాల్లో పని చేశారు. మహిళల ఉపాధి నష్టం 4.2 శాతంగా ఉన్నది. ఇది పురుషుల విషయంలో 3 శాతంగానే ఉండటం గమనార్హం.
2008 ఆర్థిక సంక్షోభం కంటే భిన్నంగా..
పురుషుల ఉపాధి.. మహమ్మారికి ముందున్న 2019 స్థాయికి చేరుకున్నది. అయితే, మహిళల విషయంలో ఇది దాదాపు 2018 ఏడాది స్థాయిలోనే ఉండటం ఆందోళనకరం. ''దీనర్థం.. 2019 కంటే 2021లో మహిళల ఉద్యోగాలు 1.30 కోట్లు తక్కువగా ఉంటాయి'' అని ఐఎల్ఓ ఎంప్లారుమెంట్ పాలసీ డిపార్ట్మెంట్లోని ఎంప్లాయిమెంట్ పాలసీస్, జెండర్ స్పెషలిస్ట్ వలేరియా ఈస్క్వివెల్ తెలిపారు. గతేడాది పలు దేశాలలో నమోదైన పాజిటివ్ జీడీపీ మహిళలకు ఏ మాత్రమూ ఉపయోగకరంగా లేదు. గత నెల ఐఎల్ఓ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మహమ్మారి సృష్టించిన ఈ పరిస్థితి 2008-09 లో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఆ సమయంలో ఆర్థిక సంక్షోభం ప్రభావం మహిళల కంటే పురుషుల పైనే అధికంగా పడింది. అయినప్పటికీ, ఉద్యోగ రికవరికి పట్టిన సమయం పురుషులతో పోల్చుకుంటే మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. ఐఎల్ఓ అంచనాల ప్రకారం ప్రస్తుతం 2021 పురుషులు, మహిళల ఉపాధి పుంజుకునే అవకాశమున్నప్పటికీ అది మహిళల్లో మందకొడిగా ఉండటం గమనార్హం.
42 శాతానికి పడిపోయిన ఉపాధి-జనాభా నిష్పత్తి
ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్నప్పటికీ దానికి తగిన ఉపాధి పెరగడంలేదు. ఉపాధి-జనాభా నిష్పత్తి ఆందోళనకరంగా ఉన్నది. గతేడాది మహిళల విషయంలో ఉపాధి-జనాభా నిష్పత్తి ప్రపపంచవ్యాప్తంగా 42.3శాతంగా ఉన్నది. ఇది 2019లో ఉన్న 44.8శాతంతో పోల్చుకుంటే తక్కువ కావడం గమనార్హం. ఇక పురుషుల విషయానికొస్తే 2020లో ఉపాధి-జనాభా నిష్పత్తి 67.5శాతానికి పడిపోవడం గమనార్హం. 2019లో ఇది 70.4శాతంగా ఉన్నది. 2021 ముగింపు నాటికీ ఉపాధి-జనాభా నిష్పత్తులు మహిళలు, పురుషుల్లో మహమ్మారికి ముందుస్థాయి కంటే తక్కువగా ఉంటుందని ఐఎల్ఓ అంచనా వేసింది. మహమ్మారి సమయంలో ఉద్యోగ, ఉపాధి నిలుపుదలల కోసం కొన్ని దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాలు, కొన్ని విధానాలను తీసుకొచ్చాయి. అయితే, ఇలాంటి విధానాలను తీసుకురాని దేశాలతో పోల్చుకుంటే ఈ దేశాల్లో ఉపాధి కోతలు తక్కువగా ఉన్నాయని ఈస్క్వీవెల్ వివరించారు. అయితే, ఇది మహిళల విషయంలో మరింత గణనీయంగా ఉన్నదని తెలిపారు.
ఇక యువ మహిళా కార్మికులూ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. పురుషులతో పోల్చుకుంటే అధిక సంఖ్యలో ఉద్యోగాలను వారు కోల్పోయారు. 2020లో అధిక ఆదాయం కలిగిన దేశాల్లో యువతుల ఉపాధి 11.8 శాతం తగ్గింది. మధ్య-ఆదాయ దేశాల్లో ఇది 15.8 శాతంగా ఉండటం గమనించాల్సిన అంశం. కాగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అవి ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు పటిష్టమైన, అనుకూలమైన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, భారత్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెనకబడి పోయిందని ఆర్థిక నిపుణులు తెలిపారు.