Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్ళీ తైవాన్ జలసంధిలో కవ్వింపు చర్యలు
బీజింగ్ : తైవాన్ స్వాతంత్య్రానికి తాము మద్దతునివ్వబోమని, జలసంధిలో శాంతి సుస్థిరతలు కొనసాగించేందుకు కట్టుబడి వున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల చైనాకు హామీ ఇచ్చినప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా మళ్ళీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. తైవాన్ జలసంధిని దాటుతున్న అమెరికా యుద్ధనౌకను చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) కనుగొంది. రెచ్చగొట్టే రీతిలో యుద్ధనౌక జరుపుతున్న కదలికలను పర్యవేక్షించింది. తైవాన్ జలసంధిలో మొత్తంగా యుఎస్ఎస్ మిలియస్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ కదలికలను పిఎల్ఎ ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ తన నావికా, వైమానిక బలగాలతో పర్యవేక్షించిందని కల్నల్ షియి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా చేపట్టిన ఈ చర్యతో భద్రతాపరమైన ముప్పులు పెరిగాయని, ప్రాంతీయభద్రతకు ఇది హాని కలిగిస్తుందని షి యి పేర్కొన్నారు. అన్ని రకాల బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలను తమ బలగాలు ప్రతిఘటిస్తాయని చెప్పారు. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటామన్నారు. తైవాన్ జలసంధి పొడుగునా అమెరికా యుద్దనౌకను పిఎల్ఎ నావికాదళానికి చెందిన నౌక సోమవారం వెంబడించింది. వాణిజ్య ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ దక్షిణ చైనా సముద్ర వ్యూహాత్మక వ్యవహారాల దర్యాప్తు సంస్థ మంగళవారం వెల్లడించింది. ఆరు పిఎల్ఎ యుద్ధ విమానాలు తైవాన్ వైమానిక రక్షణ గుర్తింపు మండలంలో ప్రవేశించాయని తైవాన్ రక్షణ అధికారులు తెలిపారు.