Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటివద్ద వారితో వివిధ రకాల పనులు
- 'కోవిడ్-19' సంక్షోభంతో లింగ సమానత్వంపై ప్రభావం
- శ్రేయస్సు, ఆరోగ్యం, రక్షణ..ప్రయోజనాలకు దూరం
- సుదీర్ఘకాలం విద్యాసంస్థలు మూతపడటంతోనే ఇదంతా : యునెస్కో తాజా అధ్యయనం
పారిస్ : కోవిడ్-19 సంక్షోభం, లాక్డౌన్ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా బాలబాలికల చదువుల్నే కాదు, లింగ సమానత్వాన్ని కూడా దెబ్బతీసిందని 'యునెస్కో' ఆందోళన వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలం పాఠశాలలు, కాలేజీలు, వర్సిటీలు..ఇలా అన్ని రకాల విద్యాసంస్థలూ మూతపడ్డాయి. విద్యలో అనుకోని అంతరాయాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావం బాలికలపై ఎక్కువగా ఉందని 'యునెస్కో' తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. లింగ సమానత్వంపై ప్రభావం పడిందని పేర్కొన్నది. ''వెన్ స్కూల్స్ షట్ : జెండర్డ్ ఇంపాక్ట్స్ ఆఫ్ కోవిడ్ స్కూల్ క్లోజర్' పేరుతో విడుదలైన ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
సుదీర్ఘకాలం పాఠశాలు, విద్యా సంస్థలు మూతపడటం వల్ల ముఖ్యంగా బాలికలు, యువతులు, మహిళలు ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి వద్ద పనిభారం మోయాల్సి వచ్చింది. కుటుంబ ఆదాయం దెబ్బతినటంతో ఉపాధి కోసం బాలురు పనికి వెళ్లాల్సి వచ్చింది. దాంతో వారి చదువు చాలావరకు పరిమితమైంది. ఇంటర్నెట్ సదుపాయం లేక బాలికల చదువు ఆగిపోయింది. నూతన సాంకేతిక పద్ధతుల్లో విద్యను పొందటానికి సంస్కృతీ సాంప్రదాయాలు బాలికలకు అడ్డుగా నిలిచాయి. కోవిడ్-19 రాకముందు డిజిటల్ సాంకేతికతను పొందటంలో లింగ బేధం ఎక్కువగా ఉందని, కోవిడ్ తర్వాత అది మరింత పెరిగిందని యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది.
అన్నింటికీ దూరమయ్యారు
ఆన్లైన్ బోధన కోసం కొంతమంది బాలికలు తమ తల్లిదండ్రుల స్మార్ట్ఫోన్లు ఉపయోగించారు. అయితే వారికి స్మార్ట్‌ఫోన్ అన్ని రోజులూ అందుబాటులో లేదు. ఏప్రిల్-సెప్టెంబర్ 2020 మధ్య పూర్తిగా చదువుకు దూరమయ్యా మని చెప్పిన బాలికలు 10శాతం వరకూ ఉన్నారు. బాలికల విషయంలో పాఠశాలలు కేవలం విద్యను అందించే కేంద్రాలేగాక, వారి శ్రేయస్సు, ఆరోగ్యం, రక్షణ అనేవి కూడా ముడిపడి ఉన్నాయన్న సంగతిని ఈ సంక్షోభం ప్రపంచానికి గుర్తుచేసింది. పాఠశాలు సుదీర్ఘకాలం మూతపడటం బాలికల శ్రేయస్సు, ఆరోగ్యం, రక్షణపై తీవ్ర ప్రభావం చూపిందన్నది యునెస్కో అధ్యయనం తెలిపింది.
160కోట్లమంది విద్యకు దూరం స్టెఫానియా గియాన్నిని, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ ఎడ్యుకేషన్(యునెస్కో)
కోవిడ్-19 తీవ్రరూపం దాల్చినవేళ పాఠశాలలు మూతపడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160కోట్లమంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. వీరు విద్యకు దూరమవ్వటమే కాదు, అనేక విధాలుగా నష్టపోయారు. సంక్షోభం స్కూల్ డ్రాపౌట్స్‌ను పెంచింది. ప్రత్యక్ష విద్యా బోధన దెబ్బతిన్నది. అలాగే లింగ సమానత్వాన్ని ప్రమాదంలో పడేసింది. బాలికల శ్రేయస్సు, ఆరోగ్యం, సంరక్షణకు సవాళ్లు ఏర్పడ్డాయి.