Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీర్మానాన్ని ఆమోదించిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ
ఢాకా : బంగ్లాదేశ్, నేపాల్‌లతో సహా మూడు దేశాలను వర్ధమాన దేశాల కేటగిరీలోకి చేరుస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చారిత్రక తీర్మానం ఆమోదించింది. లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌తో సహా ఈ మూడు దేశాలు ఇప్పటివరకు ఏ మాత్రమూ అభివృద్ధి చెందని దేశాలు (ఎల్డీసీ) కేటగిరీలో వున్నాయి. ఈ చర్యని ఈ దేశాలు సాధిస్తున్న గణనీయమైన అభివృద్ధి క్రమాన్ని వెల్లడించే ప్రధాన మైలురాయిగా భావిస్తున్నారు. ఈ మూడు దేశాల గ్రాడ్యుయేషన్‌కు అనుమతినిస్తూ 76వ సమావేశంలో జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించినట్టు బుధవారం ఒక ప్రకటనలో ఐక్యరాజ్య సమితి తెలిపింది. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో కోలుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తూనే, కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక, సామాజిక నష్టాన్ని పూడ్చుకోవడానికి అవసరమైన విధానాలను, వ్యూహాలను అమలు చేస్తూనే ఈ మూడు దేశాలు ఎల్‌డిసి కేటగిరీ నుండి మారేందుకు సన్నద్ధమవాల్సి వుంటుందని ఆ ప్రకటన పేర్కొంది. అధికారికంగా 2026లో బంగ్లాదేశ్ వర్ధమాన దేశంగా మారుతుంది. కోవిడ్ కారణంగా ఈ పరివర్తనకు అవసరమైన సమయాన్ని మూడేళ్ల నుండి ఐదేళ్ళకు పెంచారు.
కాగా, వర్ధమాన దేశాల గ్రూపులోకి చేరుస్తూ తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి ఇంతకన్నా మంచి సందర్భం ఏముటుందని ఐరాసలో బంగ్లాదేశ్ శాశ్వత ప్రతినిధి రబాబ్ ఫాతిమా ట్వీట్ చేశారు. జాతీయ ఆకాంక్ష, ప్రధాని 2021 దార్శనికత దీనితో నెరవేరిందని అన్నారు. సభ్య దేశాలందరికీ ముఖ్యంగా వర్ధమాన దేశాల భాగస్వాములకు ఫాతిమా కృతజ్ఞతలు తెలియచేశారు. ప్రస్తుతం ఎల్‌డిసి జాబితాలో 46 దేశాలు వున్నాయి. వర్ధమాన దేశంగా మారాలంటే అమలవాల్సిన నిబంధనల్లో తలసరి ఆదాయం 1230 డాలర్లుగా వుండాలన్నది ఒక నిబంధన అని ఐక్యరాజ్య సమితి పేర్కొంటోంది. 1975లో బంగ్లాదేశ్‌ను ఎల్‌డిసి గ్రూపులోకి చేర్చే సమయానికి దేశంలో పేదరికం రేటు 83శాతంగా వుంది. 2019-20 నాటికి ఆ రేటు 20.5శాతానికి తగ్గింది.