Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోహెన్నస్‌బర్గ్ : కోవిడ్‌తో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పేరు చెప్పి తమ దేశంపై అనేక దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా మండిపడింది. ఈ నిర్ణయాన్ని వివేకం లేని చర్యగా విమర్శించింది. కరోనాపై సమాచారం పంచుకోవడంలో మరింత పారదర్శకత కావాలని తెలిపింది. ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరమో ఇంకా పూర్తి సమాచారం లేకుండా ఇలా ఆంక్షలను విధించడాన్ని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్మన్ ఎంజెలీక్యూ కౌట్జీ తప్పుపట్టారు. మీడియాతో కౌట్జీ మాట్లాడుతూ వేరియంట్‌ను గుర్తించినందుకు దక్షిణాఫ్రికా ప్రశంసించబడాలి కానీ, దూషించబడకూడదని అన్నారు. నూతన కరోనా వేరియంట్ బి.11.529 (ఒమిక్రాన్) దక్షిణాఫ్రికాలో తొలిసారిగా గుర్తించబడటంతో 18 దేశాలు ఆ దేశానికి విమానప్రయాణాలు నిషేధించాయి.
దేశంలో ప్రవేశించిన వారికి ఆస్ట్రేలియా పరీక్షలు
ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో దేశంలో ప్రవేశించినవారికి అత్యవసర కరోనా పరీక్షలను ఆస్ట్రేలియా నిర్వహిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల ఆ దేశానికి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా వెల్లడికావడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమయింది. దేశానికి వచ్చిన వారందరికీ అత్యవసర నిర్ధారణ పరీక్షలు జరుపుతోంది. బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే తొమ్మిది ఆఫ్రికా దేశాలపై ప్రయాణ ఆంక్షలను ఆస్ట్రేలియా విధించింది. ఈ దేశాల్లో గత 14 రోజుల నుంచి ఉన్నవారు ఆస్ట్రేలియాలో ప్రవేశించడానికి అనుమతించరు. ఈ దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు, వీరిని 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతోంది.
వచ్చే నెలలోనే మిస్ యూనివర్స్ పోటీలు : ఇజ్రాయిల్
ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో ప్రయాణ ఆంక్షలు విధించినప్పటికీ, డిసెంబరు 12న మిస్ యూనివర్స్ పోటీలను యథావిధిగాచ నిర్వహిస్తామని ఇజ్రాయిల్ పర్యాటక శాఖ మంత్రి యోల్ రెజ్వోజోవ్ ఆదివారం తెలిపారు. ఈలాట్లోని ఎర్ర సముద్రంలో ఉన్న రిసార్ట్‌లో జరిగే పోటీల్లో పాల్గొనేవారికి ప్రతీ 48 గంటలకు పిసిఆర్ పరీక్షలు జరపడంతో పాటు ఇతర ముందు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.