Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
న్యూఢిల్లీ: భారత్‌లో తగిన కోవిడ్ జాగ్రత్తలు పాటించడానికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఓ హెచ్చరిక సంకేతం లాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఆమె ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ కొత్త వేరియంట్ కట్టడికి పలు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ప్రధానంగా మాస్కులు ధరించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. మాస్కులను 'జేబులో ఉన్న వ్యాక్సిన్లు' లాంటివని ఆమె పేర్కొన్నారు. వైరస్ కట్టడికి ఇవి సమర్ధంగా పనిచేస్తాయనీ, ప్రధానంగా చూట్టూ మూసిఉన్న వాతావరణంలో ఇవి తప్పనిసరి అని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కొత్త వేరియంట్ కట్టడికి సశాస్త్రీయ వ్యూహాన్ని అనుసరించాలన్నారు. దీని స్వభావాన్ని గుర్తించేందుకు మరింత అధ్యయనం అవసరమని చెప్పారు.
వ్యాప్తి తీరుపై పరిశీలన : ఐసీఎంఆర్
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీరు, దీనిపై వ్యాక్సిన్ల సమర్థత వంటి అంశాలను పరిశీలిస్తున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త సమీరన్ పాండా తెలిపారు. ఈ కొత్త రకానికి సంబంధించి పలు ఇతర దేశాల్లో జన్యుపరమైన వైవిధ్యాలు, నిర్మాణాత్మక మార్పులు కనిపించినట్టు చెప్పారు. ఈ మార్పులు వైరస్ వ్యాప్తిని పెంచుతాయా? టీకాల పనితీరును ప్రభావితం చేస్తాయా? అన్నది పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు. కాగా దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని చెప్పారు.