Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్చుస్థాయిలో ప్రబలితే తీవ్ర పరిణామాలు: డబ్ల్యూహెచ్‌వో
- ఇప్పటికే అనేక దేశాల్లో ఆంక్షలు..
జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బీ.1.1.529) యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఈ వేరియంట్ కారణంగా ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచివున్నదని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. అయితే, ఒమిక్రాన్ వ్యాప్తి, తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది అనేదానిపై అనిశ్చితి నెలకొని వుందని తెలిపింది. ఇప్పటికే ఈ వేరియంట్‌తో ప్రపంచ దేశాలు అప్రమత్తమై.. ఆంక్షలతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఒమిక్రాన్ వేరియంట్ హెచ్చుస్థాయిలో ప్రబలితే, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించినా.. ఒమిక్రాన్ కారణంగా మరణాలు మాత్రం నమోదుకాలేదని తెలిపింది. కాగా, బీ.1.1.529 వేరియంట్‌ను ఆందోళనకరమైనదిగా నవంబర్ 26న ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో.. వెంటనే సమావేశమై టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు ఇచ్చిన సూచన మేరకు ఆ వేరియంట్‌కు ఒమిక్రాన్ అని నామకరణం చేసింది.
13 దేశాలకు వ్యాప్తి..
నవంబర్ 24న దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. అక్కడ కేసులు కూడా పెరుగుతున్నాయి. కాగా, ఇప్పటికే ఈ వేరియంట్ దాదాపు 13 దేశాలకు వ్యాపించింది. వాటిలో ఆస్ట్రేలియా, బెల్జియం, బోట్స్వానా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, యూకేలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాలు విధించాయి.
ఒమిక్రాన్ వ్యాప్తి అధికం.. : ఆంథోనీ ఫౌసీ
ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నదని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు. అమెరికన్లు అందరూ త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలనీ, వీలైనవాళ్లు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. అమెరికాలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్నాయనీ, చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఇక కొత్త వేరియంట్ అమెరికన్లపై పెను ప్రభావం చూపే అవకాశముం దన్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణా ఫ్రికాతో పాటు 8 ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమాన ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు విధించింది.
ఒమిక్రాన్‌లో ఎక్కువ మ్యుటేషన్లు..: గులేరియా
ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రొటీన్‌లో 30కిపైగా ఉత్పరివర్తనాలు సంభవించినట్టు ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. దీంతో దీనికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పొందగలుగుతుందన్నారు. ఈ మ్యుటేషన్లే ప్రమాదకరంగా మారవచ్చనీ, ఇదే జరిగితే టీకా సామర్థ్యం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.