Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంటోనీ ఫౌచీ
వాషింగ్టన్: ఒమిక్రాన్ అనే కరోనా కొత్త వేరియంట్ క్రమంగా ప్రపంచదేశాలకు వ్యాపిస్తోంది. దీనిపై అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ... ఇప్పటివరకు యూఎస్‌లో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదన్నారు. కానీ దేశంలో ఈ వేరియంట్ ప్రవేశించి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై సమర్థంగా పనిచేస్తాయా? లేదా?.. ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
అలాగే గత వేరియంట్ల కంటే ఇది ఎంతమేర ప్రమాదకరమనే విషయాలను శాస్త్రవేత్తలు మరో వారం లేదా రెండు వారాల్లో కనుక్కొంటారని చెప్పారు. మరోవైపు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ ఒమిక్రాన్.. అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని అడ్డుకోవడం కోసం ఎనిమిది దక్షిణాఫ్రికా దేశాలపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు మించి కొత్తగా లాక్డౌన్, ప్రయాణాలను నిషేధించాల్సిన అవసరం లేదని దేశాధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అమెరికాలో అలాంటి పరిస్థితి ఇప్పట్లో రాదని బైడెన్ వెల్లడించారు. అమెరికాలో ఒమిక్రాన్ పరిస్థితిపై స్పందించిన ఆయన.. ఈ కరోనా కొత్త వేరియంట్ వల్ల ఆందోళన ఉండొచ్చు కానీ.. భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బూస్టర్ డోసులు వైరస్ నుంచి మరింత రక్షణ కల్పిస్తాయని చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ భావిస్తున్నట్లు వెల్లడించారు.