Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల గ్రూపు నివేదిక
- అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యానికై విజ్ఞప్తి
జెరూసలేం : ఇటీవలి సంవత్సరాల్లో గాజా సరిహద్దు పొడవునా జరిగిన హింసాత్మక నిరసనల్లో 200మందికి పైగా పాలస్తీనియన్లు మరణించడానికి కారణమైన కాల్పుల ఘటనపై దర్యాప్తు చేయడంలో ఇజ్రాయిల్ విఫలమైందని మానవ హక్కుల గ్రూపులు గురువారం పేర్కొన్నాయి. ఈ కాల్పుల్లో వేలాదిమంది గాయపడ్డారు. ఇజ్రాయిల్ హక్కుల గ్రూపు బి టెస్లెమ్, గాజాకి చెందిన పాలస్తీనియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ (పిసిహెచ్ఆర్)లు గురువారం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేశాయి. సీనియర్ కమాండర్లు జారీ చేసిన ఆదేశాలపై దర్యాప్తు చేయడంలో మిలటరీ విఫలమైందని, కాల్పులు జరిపిన సైనికులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నివేదిక పేర్కొంది. దీంతో ఈ విషయంలో అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసిసి) జోక్యం చేసుకునేందుకు అవకాశాలు బలపడ్డాయని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. కాగా ఈ కాల్పులను ఇజ్రాయిల్ మిలటరీ తిరస్కరిస్తోంది. సరిహద్దుల గుండా లోపలకు చొరబడి దాడులు జరిపేందుకు గానూ హమస్ పాలకులు నిర్వహించిన మూకుమ్మడి అల్లర్లని ఇజ్రాయిల్ వ్యాఖ్యానిస్తోంది. 2018 మార్చి నుండి వారం వారం గాజా కార్యకర్తలు సరిహద్దుల్లో నిరసనలు నిర్వహించారు. ఇలా 18మాసాల పాటు కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది పాలస్తీనియన్లు సరిహద్దులకు చేరుకునేవారు. వారి ఆందోళనలను అడ్డుకునేందుకు ఇజ్రాయిల్ బలగాలు తూటాలను పేల్చారు. రబ్బర్ బుల్లెట్లను, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఇదంతా తమ ఆత్మరక్షణ కోసమేనని ఇజ్రాయిల్ వాదిస్తోంది. వేలాదిమంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్లోకి చొరబడకుండా నివారించడానికే తాము అలా వ్యవహరించాల్సి వచ్చిందని చెబుతోంది.