Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక ప్యాకేజీ పునరుద్ధరించకపోతే సంక్షోభమే : ఐఎంఎఫ్
వాషింగ్టన్ : స్వల్ప ఆదాయం గల దేశాల రుణ భారాన్ని పరిష్కరించకపోతే ఆ దేశాలు ఆర్థికంగా కుప్పకూలుతాయని 'అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ' (ఐఎంఎఫ్) హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్, ఇథోపియా, సొమాలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గ్రెనెడా, మొజాంబిక్..మొదలైన 30కిపైగా పేద దేశాలు తీవ్రమైన ఆర్థిక రుణభారాన్ని ఎదుర్కొంటున్నాయని, కొత్త నిబంధనలతో ఆర్థిక ప్యాకేజీని పునరుద్ధరించకపోతే ఆ దేశాలు ఆర్థికంగా పెనుముప్పులో చిక్కుకుంటాయని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. పేద దేశాల్లో 60శాతం ఆర్థిక ముప్పులో ఉన్నాయని, అధిక రుణ భారంతో సమస్యల్లో ఉన్నాయని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా, నిధుల విభాగం హెడ్ సైలా పాజారబాసిగ్లు విడుదల చేసిన తమ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. పేదదేశాల రుణభారం 2015తో పోల్చితే రెట్టింపు అయ్యాయని ఈ బ్లాగ్‌లో తెలిపారు. స్వల్ప ఆదాయం కలిగిన పేద దేశాలపై జీ-20 గ్రూప్ తీసుకున్న నిర్ణయంతో రుణ సేవలు నిలిచిపోయాయి. దాంతో ఆ దేశాల వడ్డీలు, రుణ భారం విపరీతంగా పెరిగాయి. రుణాల పునర్నిర్మాణంపై ధనిక దేశాలు ముందుకురాకపోతే పేద దేశాలు కచ్చితంగా కుప్పకూలుతాయని ఐఎంఎఫ్ అంచనావేస్తోంది. ప్రపంచ బ్యాంక్ ఇటీవలి నివేదిక ప్రకారం, కోవిడ్-19 సంక్షోభం పేద దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆర్థికమాంద్యం ఈ దేశాల్లో 10కోట్లమందిని తీవ్రమైన పేదరికంలోకి నెట్టింది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియెంట్ కారణంగా మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. పేద దేశాల రుణ భారం, ఆర్థిక పతనంపై ఐఎంఎఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయమే గతంలో ప్రపంచ బ్యాంక్ కూడా తెలిపింది. ఈనేపథ్యంలో పేద దేశాలకు అందిస్తున్న ఆర్థిక ప్యాకేజీపై జీ-20 దేశాల కూటమి వెంటనే చొరవ తీసుకొని రుణ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని, ఆర్థిక సాయాన్ని పునరుద్ధరించాలని ఐఎంఎఫ్ పేర్కొన్నది.