Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ప్రజాస్వామ్య సదస్సుపై చైనా వ్యాఖ్య
బీజింగ్ : అమెరికా తన అడుగులకు మడుగులొత్తే కొన్ని దేశాలను కలుపుకుని డిసెంబరు 9,10 తేదీల్లో నిర్వహించతలపెట్టిన ప్రజాస్వామ్య సదస్సు అతిపెద్ద జోక్ అని చైనా సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ వ్యవస్థలు, అభివృద్ధి నమూనాలు కలిగిన దేశాలను అణచివేసేందుకు ప్రజాస్వామ్యాన్ని ఒక ముసుగుగా అమెరికా ఉపయోగించుకుంటోందని అన్నారు. శనివారం ఇక్కడ ఒక పత్రికా గోష్టిలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఎలా వుండాలనే అంశంపై చైనా, అమెరికాలు పోరాడతాయా లేదా అన్న ప్రశ్నకు సమాధానంగా సిపిసి కేంద్ర కమిటీ ప్రచార విభాగ వైస్ మినిస్టర్ గ్జూ లిన్ పై వ్యాఖ్యలు చేశారు. ''ప్రజాస్వామ్యమనేది చాలా వైవిధ్యమైనది. దానికి ఒకే పంథా అంటూ వుండదు. ఎవరికి అనువైన పంథా వారు అనుసరించడం ఉత్తమం. వివిధ దేశాల్లోని వివిధ నమూనాలన్నింటినీ కలుపుకుని పోవడం, ప్రజాస్వామ్యాన్ని కోరుతూ ఇతర దేశాలు సాగించే అన్వేషణ నుండి నేర్చుకుంటూ, వాటిని గౌరవించడమే నిజమైన ప్రజాస్వామ్యం'' అని గ్జూ స్పష్టం చేశారు. తాము అనుసరించే వ్యవస్థను పాటించే దేశాలను మాత్రమే గుర్తించాలనే ఆధిపత్యవాద ధోరణి, మనస్తత్వం కలిగిన దేశాలు కొన్ని వున్నాయి. ఇతర ప్రజాస్వామ్య నమూనాలు కలిగిన దేశాలను మినహాయిస్తారు, దాడిచేస్తారు, ఇది పూర్తిగా అప్రజాస్వామికమని గ్జూ వివరించారు. ఆ దేశాల్లో ప్రజాస్వామ్యానికి సంబంధించి చెత్త రికార్డులు వున్నా, దేశీయ పాలనా వ్యవహరాల్లో గందరగోళంగా వున్నా కానీ ఇతరుల ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ వుంటారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వుంటారు, ఇదేనా వారు సమర్ధించే ప్రజాస్వామ్యం? అని గ్జూ ప్రశ్నించారు.