Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త వేరియంట్ నేపథ్యంలో యూపీలో కర్ఫ్యూ
జెనీవా: ఇదివరకు వెలుగుచూసిన కరోనా వేరియంట్ల కన్నా.. ఒమిక్రాన్ మరింత ప్రమాదకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కరోనా వ్యాక్సిన్లు అందిస్తున్న రక్షణను పూర్తిగా దాటివేసే శక్తి ఒమ్రికాన్‌కు లేదన్న అభిప్రాయాన్ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అయితే, కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ గురించి మరింత సమాచారం రావాల్సి వుందనీ, అప్పుడే దీనికిపై ఖచ్చితమైన నిర్ణయానికి రావచ్చునని స్పష్టం చేసింది. డెల్టా లేదా ఇతర వేరియంట్ల కన్నా ప్రమాదకరరీతిలో ఒమిక్రాన్ లేదని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ డైరక్టర్ మైఖేల్ ర్యాన్ అన్నారు. ప్రాథమిక డేటా ఆధారంగా ఒమిక్రాన్ సీరియస్‌గా లేదని తెలుస్తోందనీ, కానీ దీనిపై మరింత అధ్యయనం జరగాల్సివుందన్నారు. ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్ గురించి తెలుస్తోందనీ, పూర్తి సమాచారం అందేవరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ల ద్వారా కలిగే రక్షణ వ్యవస్థను ఒమ్రికాన్ దాటివేస్తుందన్న ఆధారాలు కూడా ఏమీలేవని ర్యాన్ అన్నారు. ఇదిలావుండగా, అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ మరింత ప్రమాదరమైనది కాదన్నారు. ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం నిజమేననీ, అది డెల్టా కన్నా వేగంగా విస్తరిస్తోందనీ, కానీ డెల్టా కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైంది ఏమీ కాదు అని ఫౌసీ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయన్న దానిపై ల్యాబ్‌లో పరీక్షలు జరుగుతున్నాయనీ, వాటి ఫలితాలు మరికొన్ని రోజుల్లో వస్తాయని ఫౌసీ చెప్పారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ పరస్థితులను తారుమారు చేసిందనీ, వ్యాక్సినేషన్ రేటు తగ్గితే మరణాలతో పాటు ఆస్పత్రుల పాలయ్యేవారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పేర్కొంది. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్నోలో కర్ఫ్యూను విధించింది. జనవరి 5వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే, మాఘమేళా నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో పరీక్షల నిర్వహణ కోసం ప్రయాణ ప్రాంగణాల్లో హెల్త్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు జిల్లా యంత్రాంగం పేర్కొంది.