Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యమే మా ఆయుధం: చైనా
బీజింగ్ : ఘర్షణలను, విభజనలను రెచ్చగొట్టడానికి, తన గుత్తాధిపత్యాన్ని సాగించడానికి ప్రజాస్వామ్యాన్ని ఒక ఆయుధంగా అమెరికా ఉపయోగించుకుంటోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తద్వారా తన అంతర్గత సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించాలన్నది వారి లక్ష్యమని అన్నారు. గురు, శుక్రవారాల్లో అమెరికా ప్రజాస్వామ్య సదస్సును నిర్వహించింది. ప్రజాస్వామ్య విలువలను, మానవ హక్కులను పెంపొందించడం ఈ సదస్సు లక్ష్యమని అమెరికా చెబుతున్నప్పటికీ, తన భావజాలం ద్వారా ప్రపంచ దేశాలను విభజించేందుకే ఈ సదస్సని అంతర్జాతీయ నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అనే సాకుతో ప్రజాస్వామ్యాన్ని భగం చేయాలని అమెరికా ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. యావత్ ప్రపంచంపై తన గుత్తాధిపత్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రయత్నిస్తోంది, అంతర్జాతీయ వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని ఆ ప్రకటన విమర్శించింది. అమెరికా ప్రజాస్వామ్యానికి దిక్సూచి కాదని చైనా ప్రతినిధి వ్యాఖ్యానించారు. అమెరికా తరహా ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు. ధన రాజకీయాలు, గుర్తింపు కోరుకునే రాజకీయాలు, భాగస్వామ్యం, రాజకీయ చీలికలు, సామాజిక విభజన, వర్ణవివక్ష, ఉద్రిక్తతలు, సంపదలో అంతరాలు వంటివన్నీ అమెరికా ప్రజాస్వామ్యంలో సమస్యలని అన్నారు. అమెరికా ప్రజాస్వామ్యం మంచిదా కాదా అని సర్వే చేస్తే ఇతర దేశాలకు అమెరికా ప్రజాస్వామ్యం ఆదర్శప్రాయమైనది కాదని 72శాతం అమెరికన్లు అభిప్రాయపడ్డారని చైనా ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా భవిష్యత్ ప్రజాస్వామ్యానికి దేశీయంగా తీవ్ర ముప్పులు వున్నాయని 81శాతం మంది పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పంథా అనేది ఆ దేశ ప్రజలు స్వయంగా ఎంపిక చేసుకోవాలని, అంతేకానీ బయట నుండి బలవంతంగా రుద్దేదిగా వుండరాదన్నారు.