Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న జర్నలిస్టు రెస్సా వ్యాఖ్య
ఓస్లో : సోషల్ మీడియాలో విషాన్ని చిమ్ముతున్నారంటూ అమెరికా టెక్ దిగ్గజాలను ఫిలిప్పీన్ జర్నలిస్టు మరియా రెస్సా తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ఆమె స్వీకరించారు. రాప్లర్ వార్తా వెబ్సైట్ సహ వ్యవస్థాపకురాలైన రెస్సా, నోవయా గెజెటా ఎడిటర్ ఇన్ చీఫ్ దిమిత్రి మరతొవ్తో కలిసి నోబెల్ శాంతి బహుమతిని పంచుకున్నారు. ప్రత్యేకంగా పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ ఫేస్బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి అమెరికన్ ఇంటర్నెట్ కంపెనీల తీరుపై ఆమె ధ్వజమెత్తారు. ''వారి సాంకేతికతతో మనలో ప్రతి ఒక్కరికీ అసత్యాల వైరస్ను అంటిస్తున్నారు. ఒకరిపై ఒకరికి ద్వేషాన్ని రగిలిస్తున్నారు, మన భయాలు, ఆగ్రహం, విద్వేషం, ఆందోళన అన్నింటినీ వెలికితీసి ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ పాలన ఆవిర్భవించేందుకు, నియంతలు పెరిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. ఆ విద్వేషాన్ని, హింసను మార్చాల్సిన అవసరం నేడుందన్నారు. మన సమాచార సాంకేతిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని విద్వేషాన్ని ప్రచారం చేయడం ద్వారా అమెరికన్ కంపెనీలు మరింత డబ్బు సంపాదించడానికి ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు. వాస్తవాలకు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణితో వ్యవహరించే ఈ కంపెనీలు మనల్ని విభజిస్తున్నాయని అన్నారు.