Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల మూసివేతతో విద్యార్థుల పై తీవ్రప్రభావం పడిందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. కొట్లాది మంది భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ తరం విద్యార్థులు ప్రస్తుత విలువ ప్రకారం.. తమ జీవితకాలంలో ఆర్జించే 17 లక్షల కోట్ల డాలర్ల సంపాదనను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. గతేడాది అంచనా వేసిన 10 లక్షల కోట్ల డాలర్ల నష్టానికి మించి ఇది నమోదు అయిందని పేర్కొంది. మొత్తంగా ప్రపంచ జీడీపీలో సుమారు 14 శాతంగా ఉంటుందని వివరించింది. భారత్‌లోనూ పరిస్థితులు దారుణంగా మారాయని లాక్డౌన్ నేపథ్యంలో విద్యారంగంపై పడిన దుష్ప్రభావానికి సంబంధించి 'స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ఎడ్యుకేషన్ క్రైసిస్: ఏ పాత్ టు రికవరీ రిపోర్ట్' పేరుతో ప్రపంచ బ్యాంక విడుదల చేసిన తన రిపోర్టులో పేర్కొంది. యునెస్కో, యూనిసెఫ్ సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రస్తావించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. కరోనాకు ముందు అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని 53 శాతం మంది విద్యార్థులు విద్యావకాశాలకు దూరంగా ఉన్నారు. ఇది లాక్డౌన్ సమయంలో 70 శాతానికి పెరిగింది. దీర్ఘకాలంపాటు పాఠశాలల మూసివేత, ఆన్లైన్ తరగతులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొకంది. కరోనా సంక్షోభం మొదలై దాదాపు 21 నెలలు గడిచినా.. ఇప్పటికీ పెద్దఎత్తున విద్యాసంస్థలు తెరవకపోవడంతో లక్షల మంది పిల్లలు విద్యాభ్యాసానికి దూరమయ్యారు. ప్రస్తుత తరానికి జరుగుతున్న అభ్యాసన నష్టం వల్ల భవిష్యత్తులో ఉత్పాదకత ఆందోళనకరస్థాయిలో పడిపోనుంది. ఫలితంగా వారి సంపాదనతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం పడనుందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది.స్కూళ్లకు దూరం కావడం వల్ల గ్రామీణ భారతంతోని విద్యార్థులు గణితంతో పాటు చదవడంలోనూ బాగా వెనుకబడ్డారు. పాకిస్థాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థుల అభ్యాసన నష్టానికి.. స్కూళ్ల మూసివేతతో ప్రత్యక్ష సంబంధముందని తెలిపింది. దీంతో పాటు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, జెండర్ తదితర అంశాలు కూడా అభ్యాసన నష్టం స్థాయి పెరగడానికి కారణమయ్యాయని తెలిపింది. విద్యారంగానికి ఉపశమనం కలిగించేందుకు ఇప్పటివరకు ప్రభుత్వాలు ఉద్దీపన ప్యాకేజీల్లో 3 శాతం కంటే తక్కువే కేటాయింపులు చేశారనీ, ఈ వాటాను పెంచాల్సిన అవసరం అధికంగా ఉందని తెలిపింది. ప్రపంచంలోని అన్ని దేశాలు తమ విద్యార్థులకు రిమోట్ లెర్నింగ్ అవకాశాలను అందిస్తున్నప్పటికీ.. అందులో నాణ్యతను పాటించడం లేదని ఈ నివేదిక పేర్కొంది. అల్పాదాయ, అత్యల్పాదాయ దేశాల్లోని దాదాపు 20 కోట్ల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన ఆన్లైన్ బోధన అందలేదని పేర్కొంది.