Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ మార్పుపై ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు
- చైనా, రష్యాలు కూడా..
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ షాకిచ్చింది. వాతావరణ మార్పుపై యూఎన్ భద్రతా మండలి ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత్ ఆమోదించలేదు. ఈ మేరకు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ తీర్మానం.. గతనెల గ్లాస్గోలో జరిగిన కాప్26 సమ్మిట్లో కుదిరిన ఒప్పందాన్ని బలహీనపరిచే ప్రయత్నమని తెలిపింది. వాతావరణ మార్పుపై చర్చలు జరపడానికి భద్రతా మండలి వేదిక కాదని ఈ సందర్భంగా భారత్ వెల్లడించింది. భారత్తో పాటు చైనా, రష్యాలు కూడా ఈ ముసాయిదా తీర్మానాన్ని వ్యతిరేకించాయి. కాగా,దీనికి భద్రతా మండలిలోని 15మంది సభ్యులకు గానూ 12మంది నుంచి ఆమోదం లభించింది. వాతావ రణ మార్పుపై భద్రతా మండలి తీర్మానం..గ్లాస్గో ఒప్పందాన్ని బలహీనపరిచే ప్రయత్నమని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు. ఈ తీర్మానం విస్తృత యూఎన్ సభ్యత్వంలో అసమ్మతి బీజాలను మాత్రమే నాటుతుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ తీర్మానం తప్పుడు సందేశాన్ని తీసుకెళ్తుందని ఆయన చెప్పారు.