Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన
వాషింగ్టన్: కరోనా వైరస్ అమెరికాలో కల్లోలం రేపుతున్నది. దాదాపు దేశంలోని పౌరులందరికీ కోవిడ్-19 టీకాలు వేసినప్పటికీ.. కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్ కేసులు సైతం యూఎస్‌లో అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో కరోనా కారణంగా మొత్తం 8 లక్షల మందికి పైగా చనిపోయారని అధికారులు వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక కోవిడ్-19 మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. అలాగే, కరోనా పాజిటివ్ కేసులు 50 మిలియన్లను దాటాయి. మొత్తం మరణాల్లో టీకా తీసుకోని వారితో పాటు వృద్దులు ఎక్కువగా చనిపోయారని గణాంకాలు పేర్కొంటున్నాయి. గతేడాదితో పోలిస్తే 2021లోనే కరోనా మరణాలు అధికంగా నమోదయ్యాయి. మరణాల రేటు సైతం అధికంగానే ఉంది. గడిచిన 11 వారాల్లోనే లక్ష మందికిపైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వత కరోనా మరణాలు అధికంగా బ్రెజిల్, భారత్‌లలో నమోదయ్యాయి.
ప్రమాదకర స్థాయిలో ఒమిక్రాన్ వ్యాప్తి: డబ్ల్యూహెచ్‌వో
దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఇప్పటికే ఒమిక్రాన్ 77 దేశాలకు పైగా విస్తరించిందని తెలిపింది. ఇతర దేశాల్లోనూ ఈ వేరియంట్‌ను గుర్తించే పనిలో ఉన్నామని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అదుపు చేసేందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. వైరస్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యామనీ, ఒమిక్రాన్ వల్ల స్వల్పతీవ్రత ఉన్న వ్యాధి సోకినా, దాంతో ఆరోగ్య వ్యవస్థపై మళ్లీ ప్రభావం పడుతుందని హెచ్చరించారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అసమానతలు కొనసాగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ వేళ కొన్ని దేశాలు బూస్టర్ డోసులు ఇస్తున్నాయనీ, కానీ ఇంకా కొన్ని దేశాలకు అసలు వ్యాక్సిన్లు అందలేదన్నారు. ఈ విషయంపై ధనిక దేశాలు ఆలోచన చేయాలని కోరారు.