Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునేందుకు కొత్తగా విధించే ఆంక్షలకు మద్దతివ్వాల్సిందిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంట్ సభ్యులను కోరారు. ఒకపక్క బ్రిటన్‌లో కేసులు పెరుగుతుంటే మరోపక్క ప్రధాని జాన్సన్ ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల సభ్యులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వైరస్‌ను నియంత్రించేలా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ విమర్శిస్తున్నారు. కాగా, నైట్‌క్లబ్‌లు, ఇతర రద్దీగా వుండే ప్రాంతాల్లోకి ప్రవేశించాలంటే వ్యాక్సిన్ పాస్‌పోర్టులు అవసరమని స్పష్టం చేస్తూ ప్రతినిధుల సభలో ఎంపీలు ఓటు వేశారు. కానీ దాదాపు వందమంది సభ్యులు మాత్రం ఈ చర్యను వ్యతిరేకించారు. ప్రధాని జాన్సన్‌తో విబేధించారు. అయినప్పటికీ ప్రతిపక్షం మద్దతు తెలియచేయడంతో ప్రభుత్వ చర్యలు ఆమోద ముద్ర పొంది బుధవారం నుండి అమల్లోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు జాన్సన్ రాజకీయ భవితవ్యానికి తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టే అవకాశాలు వున్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ను ఎదుర్కొనడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల చాలా అసంతృప్తిగా వున్నామని, టీమ్ విశ్వసనీయతపైనే టీమ్ కెప్టెన్ ఆధారపడి వుంటారని తిరుగుబాటు దారుల్లో ఒకరైన మార్క్ హార్పర్ వ్యాఖ్యానిం చారు. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో 98మంది కన్జర్వేటివ్ ఎంపిలు వ్యతిరేకంగా ఓటు వేశారు. వీరిలో చాలా మంది గతంలో జాన్సన్‌ను అభిమానించిన వారే. గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరిస్సా మేపై కూడా ఇటువంటి తిరుగుబాట్లే జరిగాయి. మంగళవారం నాటి ఓటింగ్ ప్రక్రియ దాన్ని తలపింపచేసింది. తీవ్రంగా వున్న ముప్పును ఎదుర్కొనాలంటే కఠిన ఆంక్షలు తప్పనిసరని జాన్సన్ ప్రభుత్వం వాదిస్తోంది. బుధవారం బ్రిటన్‌లో 78,610 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి.