Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్లో వీధుల్లో ప్రజా ఆందోళనలు
లండన్: బ్రిటన్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, అక్కడ కొంత మంది ప్రజలు మాత్రం వ్యాక్సిన్లు వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. నిత్యం వేలాది ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో.. కట్టడి చర్యల్లో భాగంగా యూకే ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంచేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం బలవంతంగా టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందంటూ అక్కడి ప్రజలు నిరసనకు దిగారు. 'యునైటెడ్ ఫర్ ఫ్రీడం మార్చ్' పేరిట సెంట్రల్ లండన్లో ఆందోళనలు నిర్వహించారు. ఈ నిరసనల్లో దాదాపు ఐదువేల మంది పాల్గొన్నారు. పార్లమెంటు స్క్వేర్తో పాటు ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్స్ట్రీట్ వద్ద కూడా నిరసనలు జరిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా.. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఆ ఘర్షణలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అక్కడ పాజిటివ్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం 10వేలకు పైగా కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి. వీరిని ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్ సేవలు కరవయ్యాయి. అంబులెన్స్ సిబ్బంది కూడా ఒమిక్రాన్ బారిన పడుతుండటంతో ఆందోళకర పరిస్థితులు ఏర్పడ్డాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నవారి సంఖ్య 28.6 శాతం పెరిగిందని అధికారిక నివేదికలు పేర్కొంటున్నాయి.