Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిలిప్సీన్స్‌లో నిరాశ్రయులైన 3 లక్షల మంది
- ఆహారం, నీళ్ల కోసం బాధితుల ఇబ్బందులు
మనీలా: ప్రకృతి ప్రకోపానికి ఫిలిప్పీన్స్ అతలాకుతలమవుతోంది. రారు తుఫాను దాటికి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తుఫాను ధాటికి మరణించిన వారి సంఖ్య 208కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో తుఫాను వలన ఒకేసారి ఇంతమంది మరణించడం ఇదే మొదటిసారని తెలిపారు. రారు తుఫాను నేపథ్యంలో గంటకు 195 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచాయని చెప్పారు. తీవ్ర గాలుల ధాటికి సియార్గావ్, దినాగట్, మిండనావో దీవుల్లో కూడా భారీ విధ్వంసం చోటుచేసుకుంది. రారు తుఫాను కారణంగా వేలాది భారీ వృక్షాలు నెలకొరిగాయి. వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, రారు తుఫాను కారణంగా చనిపోయిన వారిలో ఎక్కువగా, శిథిలాల కింది చిక్కుకుపోయిన వారు. ఆకస్మిక వరదల్లో మునిగిపోయిన వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావం ఆర్చిపెలాగోలోని సౌథర్న్, సెంట్రల్ రీజియన్లలో అధికండగా ఉంది. ఈ ప్రాంతాల్లోనే మరణాలు అధికంగా సంభవించాయని చెప్పారు. ఇక్కడ దాదాపు 239 మంది గాయపడ్డారనీ, మరో 52 మంది గల్లంతయ్యారని తెలిపారు. రారు తుఫాన్ విధ్వంసంతో ఫిలిప్పీన్స్‌లోని కోస్తా ప్రాంతం మొత్తం తుడుచుపెట్టుకుపోయిందని రెడ్‌క్రాస్ సంస్థ పేర్కొంది. రారు తుఫానుతో దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో తుఫాను ప్రభావం అధికంగా ఉంది. దాదాపు మూడు లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. సెంట్రల్ ఐలాండ్ ప్రావిన్సులలో 7లక్షల కంటే ఎక్కువ మంది తుఫాను బారినపడ్డారు. వీరిలో 4 లక్షల మందికి పైగా అత్యవసర సహాయక శిబిరాలకు తరలించారు. బోహౌల్ ప్రావిన్స్‌లో ఉన్న లోబోక్ అనే నదీతీర పట్టణంలో వేలాది మంది నివాసితులను రక్షించారు. అక్కడ పెరుగుతున్న వరదల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇండ్ల పైకప్పులు, చెట్లపైకి ఎక్కారు. దాదాపు 227 నగరాలు, పట్టణాల్లో విద్యుత్, టెలీ కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నది. దీనిని పునరుద్ధరించడానికి అత్యవసర సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు ప్రాంతీయ విమానాశ్రయాలు కూడా దెబ్బతిన్నాయి. దేశ వ్యాప్తంగా తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి విపత్తు ఏజెన్సీ రంగంలోకి దిగింది. వేలాది మంది మిలిటరీ, పోలీసు, కోస్ట్ గార్డ్ , అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు ఆహారం, నీరు, వైద్య సామాగ్రిని తరలిస్తున్నారు. మరణాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం మధ్య ఉన్న ఫిలిప్పీన్స్‌ను ఏటా దాదాపు 20 తుఫానులు, టైఫూన్లు దెబ్బతీస్తున్నాయి. ఇది ప్రపంచంలోని అత్యంత విపత్తు-పీడిత దేశాలలో ఒకటిగా నిలిచింది.