Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాంటియాగో : ఆదివారం జరిగిన చిలీ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి గాబ్రియెల్ బోరిక్ (35) గెలుపొందారు. మార్చిలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంత చిన్న వయస్సులోనే ఉన్నత పదవులు అధిష్టించిన వారిలో లాటిన్ అమెరికాలో రెండవ వ్యక్తిగా నిలిచారు. ఏండ్ల తరబడి జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొనే స్థాయి నుండి ఆయన అధ్యక్ష స్థాయికి ఎదిగారు. మొత్తంగా 56శాతం ఓట్లు పోలవగా, గాబ్రియెల్ తన ప్రత్యర్ధి జోస్ ఆంటానియో కాస్ట్ కన్నా 10 పాయింట్లు ఎక్కువ తేడాతో విజయం సాధించారు. యువకుడు, అనుభవం లేని వ్యక్తిని ఎన్నుకుంటే లాటిన్ అమెరికాలోనే అత్యంత సుస్థిరమైన, అభివృద్ధికరమైన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని ప్రత్యర్ధులు ఎంతగా ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. ప్రజలు గాబ్రెయల్కే పట్టం గట్టారు. అయితే ఫలితాలు వెలువడిన అనంతరం కాస్ట్ తన ఓటమిని ఒప్పుకుంటూ గాబ్రియెల్ను అభినందించారు. అనంతరం గాబ్రియెల్ తన మద్దతుదారులను ఉద్దేశించి విజయోత్సవ ప్రసంగం చేశారు. చిలీ నియంత పినొచెట్ అమలు చేసిన నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో భాగమైన చిలీ ప్రయివేట్ పెన్షన్ వ్యవస్థను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. మన హక్కులు, హక్కులుగానే గౌరవింపబడాలి కానీ వినిమయ వస్తువుల్లా లేదా వ్యాపారంలా చూడరాదని వ్యాఖ్యానించారు. ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి కృషి చేస్తానని చెప్పారు. న్యాయం, సమానత్వంతో కూడినదిగా తన పాలన వుంటుందని హామీ ఇచ్చారు. కనీస వేతనాలు పెంచడం, విద్య, ఆరోగ్య సంరక్షణకు అయ్యే వ్యయాన్ని తగ్గించడం, సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా అసమానతలను తగ్గిస్తామని ప్రతిన చేశారు. సర్వ పరివ్యాపిత అభివృద్ధి పట్ల బోరిక్కు మంచి దార్శనికత వుంది.