Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 73.2 శాతం పెరిగిన కొత్త వేరియంట్ కేసులు
- ఒమిక్రాన్‌తో తొలిమరణం నమోదు
వాషింగ్టన్ : దక్షిణాఫ్రికాలో గత నెలలో వెగులుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. దక్షిణాఫ్రికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లలో ఈ కేసులు రికార్డు స్థాయిలో పెరగడానికి కారణమైంది. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికాపైనా పంజా విసురుతోంది. తాజాగా నమోదైన ఒమిక్రాన్ మరణంతో యూఎస్ గజగజ వణికిపోతున్నది. టెక్సాస్‌లో 50 ఎండ్లు పైబడిన ఓ వ్యక్తి చనిపోవడంతో అక్కడ మొదటి ఒమిక్రాన్ కారణంగా మరణం నమోదైంది. అయితే, ఈ మరణాన్ని ఇంకా ధ్రువీకరించని సీడీసీ.. వైరస్‌వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్కవారంలో ఒమిక్రాన్ వ్యాప్తి కేసులు 3 నుంచి 73 శాతానికి పెరగడం అక్కడ కొత్త వేరియంట్ వ్యాప్తికి అద్దంపడుతోంది. వారంవారం సీడీసీ దేశంలో కరోనా సంబంధించిన పరిస్థితిపై నివేదిక విడుదల చేస్తుంది. ఆ వివరాల ప్రకారం గత వారంలో ఇప్పటివరకు అధికంగా వ్యాపించిన డెల్టా వేరియంట్ కేసులు 27 శాతానికి తగ్గాయి. ఇక దేశంలో కొత్తగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు అధికంగా పసిఫిక్ నార్త్‌వెస్ట్, సౌత్, మిడ్వెస్ట్ ప్రాంతాల్లోనే 90 శాతం కేత్త వేరియంట్ కేసులు ఉన్నాయి. అమెరికాలో 20 రోజుల కింద మొదటి ఒమిక్రాన్ నమోదైంది. ప్రస్తుతం 50కి పైగా రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించింది. గత వారం రోజులుగా దేశంలో సగటున 1,23,000 కేసుల నమోదయ్యాయని రాయిటర్స్ నివేదించింది. అంతకు మందు వారంతో పోలిస్తే 40 శాతం పెరిగింది. ఒమిక్రాన్ పంజాతో వైద్య సేవలపై భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
వైట్‌హౌస్‌లో కరోనా కలవరం..
అమెరికా అధ్యక్ష భవనంలో కరోనా కలకలం రేపింది. వైట్ హౌస్‌లోని ఓ మధ్యస్థాయి ఉద్యోగికి కరోనా సోకింది. ఆ ఉద్యోగి తరచూ అధ్యక్షుడికి కాంటాక్ట్‌లో ఉండరు. కానీ మూడు రోజుల క్రితం (17న) అధ్యక్షుడు బైడెన్.. దక్షిణ కరోలినా నుంచి పెన్సుల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఆ ఉద్యోగి కూడా ఉన్నారు. ఆ సమయంలో సదరు ఉద్యోగి బైడెన్ వద్ద 30 నిమిషాలు ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. సదరు ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్ అని తేలగానే అప్రమత్తమైన వైద్యులు బైడెన్‌కు యాంటీజెన్, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. రెండింటిలోనూ ఆయనకు నెగెటివ్ వచ్చింది. బుధవారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
బ్రిటన్‌లో ఒక్కరోజే 10వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు
బ్రిటన్‌లో ఒమిక్రాన్ కల్లోలం మొదలైంది. నిత్యం 10వేలకు పైగా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 12,133 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులు 3,201తో పోలిస్తే ఇది మూడు రెట్లు అధిరం కావడం గమనార్హం.కొత్త కేసులతో కలిపి బ్రిటన్‌లో ఒమిక్రాన్ బారిన పడ్డవారి సంఖ్య 37,101కు పెరిగింది. మొత్తం కేసులు కలిపి 90వేలకు పైగా నమోదయ్యాయి. ఒమిక్రాన్ నేపథ్యంలో క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశముందని బ్రిటన్ ఆరోగ్యమంత్రి సాజిద్ జావిద్ చెప్పారు.పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు.