Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 170దేశాల జీడీపీ కన్నా అమెరికాదే ఎక్కువ
- ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి 94లక్షల కోట్ల డాలర్లు !
- అతి చిన్న ఆర్థిక వ్యవస్థగా 7కోట్ల డాలర్లతో తువలు
వాషింగ్టన్ : స్థూల దేశీయోత్పత్తి దృష్ట్యా చూసినట్లైతే మొత్తంగా ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో సగానికి పైగా వాటా కేవలం నాలుగు దేశాలు - అమెరికా, చైనా, జపాన్, జర్మనీల నుండే వస్తోంది. వాస్తవానికి, అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఒక్కటే 170దేశాల జీడీపీ కన్నా ఎక్కువగా వుంది.
అయితే ప్రపంచంలోని వివిధ ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా పోల్చిచూడాలి? అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుండి అందిన డేటా, అంచనాలను ఉపయోగించి గ్రాఫ్‌లో చూపించినట్లుగా 2021లో దేశాల వారీగా జిడిపిలను మనం చూద్దాం. జీడీపీ లేదా స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక దేశ ఆర్థిక ఉత్పత్తికి విస్తృత ప్రామాణికంగా వుంటుంది. నిర్దిష్ట కాలపరిమితిలో అంటే ఒక త్రైమాసికంలో లేదా ఏడాదిలో ఒక దేశంలో ఉత్పత్తైన ఉత్పత్తులు, సేవలకు గల మార్కెట్ విలువను లెక్కిస్తారు. అదనంగా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ లేదా విద్య వంటి రంగాలపై ఖర్చు పెట్టే నిధులు, ప్రభుత్వం అందించే సేవల విలువను కూడా జీడీపీ పరిగణనలోకి తీసుకుంటుంది. సాధారణంగా, ఒక దేశ జీడీపీ పెరుగుతోందంటే, ఉద్యోగులు, వ్యాపారాలకు లబ్ధి చేకూర్చేలా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా వున్నాయని సూచన. (అది తగ్గుతుందంటే క్షీణిస్తోందని అర్ధం).22.9లక్షల కోట్ల డాలర్లతో అమెరికా జీడీపీ మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా 25శాతంగా వుంది. గత 60ఏళ్ళ కాలంలో ఈ వాటా గణనీయంగా మారుతూ వస్తోంది. ఆర్థిక రంగం, బీమా, రియల్ ఎస్టేట్ (4.7లక్షల కోట్ల డాలర్లు) పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడతాయి. ఆ తర్వాత స్థానం వృత్తిపరమైన సేవలు, వ్యాపార వాణిజ్య సేవల (2.7లక్షల కోట్ల డాలర్లు)ది, తర్వాత ప్రభుత్వం (2.6లక్షల కోట్ల డాలర్లు) వుంటుంది. ఇక రెండవ స్థానంలో చైనా ఆర్థిక వ్యవస్థ వుంది. దాదాపు 17లక్షల కోట్ల డాలర్ల స్థూల జాతీయోత్పత్తితో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద తయారీదారుగా నిలిచింది. విస్తృత స్థాయిలో ఉక్కు, ఎలక్ట్రానిక్స్, రొబొటిక్స్, తదితరాలను ఉత్పత్తి చేస్తోంది. యూరప్‌లో కెల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీదే. ప్రపంచంలోని మోటారు వాహనాల్లో దాదాపు 20శాతం వాహనాలను జర్మనీనే ఎగుమతి చేస్తోంది. 2019లో, దేశ జీడీపీలో దాదాపు 90శాతంతో సమానమైన వాణిజ్యాన్ని జరిపింది. ఇక మరోవైపు అతి చిన్న 50దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిశీలిద్దాం 7కోట్ల డాలర్ల జీడీపీతో తువలు ప్రపంచంలోకెల్లా అతి చిన్నదైన ఆర్థిక వ్యవస్థ. హవాయి, ఆస్ట్రేలియాల మధ్య వుండే ఈ దేశంలో ప్రాదేశిక చేపల హక్కులు అతిపెద్ద పరిశ్రమగా వుంది. దీనికి తోడు ''టీవీ'' వెబ్ డొమైన్ ద్వారా గణనీయమైన మొత్తంలో ఆదాయం ఆర్జిస్తోంది. 2011, 2019 మధ్య అమెజాన్‌తో సహా పలు కంపెనీల నుంచి వార్షికంగా 50లక్షల డాలర్లను సంపాదించింది. ఇది దేశ జిడిపిలో దాదాపు 7శాతానికి సమానం. తువలు మాదిరిగానే నౌరు, పాలావు, కిరిబటి వంటి ప్రపంచంలోని అతి చిన్న దేశాలు చాలా ఓషినియాలో వున్నాయి. వీటిల్లో చాలా దేశాలు ప్రధానంగా పర్యాటక పరిశ్రమపై ఆధారపడి వున్నాయి. ప్రజల్లో మూడో వంతు ఉపాధి ఈ రంగం నుండే వస్తుంది. 123శాతం జీడీపీ వృధ్ది అంచనాలతో లిబియా ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. చమురు ఆ దేశ అభివృద్ధిని మరింతగా నిర్దేశిస్తుంది. రోజువారీ 12లక్షల బ్యారెళ్ళ చమురు ఉత్పత్తి అవుతోంది. దీంతో పాటు ఎగుమతులు, క్షీణించిన కరెన్సీ వంటివి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వెనుక గల ప్రధాన కారణాలుగా వున్నాయి. ఐర్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచంలోని అతిపెద్ద బహుళజాతి కంపెనీల తోడ్పాటు వుంది. 13శాతం వాస్తవ జిడిపి వృద్ధిరేటు వుంటుందని అంచనా వేయబడింది. ఈ దేశంలో ఫేస్బుక్, టిక్‌టాక్, గూగుల్, యాపిల్, ఫైజర్ వంటి కంపెనీల యూరోపియన్ ప్రధాన కార్యాలయాలు వున్నాయి. అంటే 12.5శాతం కార్పొరేట్ పన్ను ద్వారా ఆదాయం లభిస్తుంది. అయితే ఐర్లాండ్, ఓఈసీడీలో చేరినందున కనీస కార్పొరేట్ పన్ను రేటు 15శాతంగా సవరించనున్నారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది అక్టోబరులోనే ఒప్పందం ఖరారైంది. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడం మొదలైన తర్వాత మకావు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మొదలైంది. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ అవినీతి వ్యతిరేక ప్రచారం, ఇటీవలి అరెస్టులతో చైనా ప్రధాన భూభాగానికి, ప్రపంచంలోనే అతిపెద్ద జూద కేంద్రమైన మకావుకి మధ్య సంబంధాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు. 94లక్షల కోట్ల డాలర్లుగా వున్న అంతర్జాతీయ స్థూల దేశీయోత్పత్తి ఈనాడు మనకి చాలా ఎక్కువగా కనిపించవచ్చు. కానీ, ఇటువంటి మొత్తం భవిష్యత్తులో మరింత నిరాడంబరంగా కనిపించవచ్చు. జీడీపీ దృష్ట్యా చూసినట్లైతే 1970లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 3లక్షల కోట్ల డాలర్లుగానే వుంది. అంటే ఈనాటి మొత్తం కన్నా దాదాపు 30రెట్లు తక్కువ. వచ్చే 30ఏండ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంతకన్నా ఎక్కువగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. లేదా కనీసం రెట్టింపు కన్నా తక్కువ వుంటుందని ఆశిస్తున్నారు. 2050కల్లా ప్రపంచ జీడీపీ మొత్తంగా 180లక్షల కోట్ల డాలర్లకు చేరువవుతుందని భావిస్తున్నారు.