Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిలీ అధ్యక్షుడుగా ఎన్నికైన బోరిక్ వ్యాఖ్య
- బోల్సనారో విమర్శలపై తర్వాత మాట్లాడతా
శాంటియాగో : ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడేటపుడు మనం మరికొంత జాగ్రత్తగా వుండాలని చిలీకి అధ్యక్షుడుగా ఎన్నికైన గాబ్రియెల్ బోరిక్ వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో ఏర్పాటుచేయబోయే మంత్రివర్గం పొందికపై కూడా సంయమనం పాటించాల్సిందిగా కోరారు. శుక్రవారం కోవిడ్ బూస్టర్ డోసు వేసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. నికొలస్ మదురో పాలనలో వెనిజులాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చిలీలో బోరిక్ కూడా అదే రీతిన దేశాన్ని నడుపుతారని బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సనారో కుమారుడు వ్యాఖ్యానించాడు. వాటిని ప్రస్తావిస్తూ బోరిక్, పై వ్యాఖ్యలు చేశారు. 'ఆ వ్యాఖ్యలను తాను చూడలేదని అన్నారు. తర్వాత వాటిని విశ్లేషిస్తానని చెప్పారు. అనవసరమైన ప్రకటనలు చేయబోనని, ప్రభుత్వ వ్యవహారాలు, విధానాల్లో కొంచెం జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని అన్నారు. చిలీ ఎన్నికల ఫలితాన్ని గుర్తిస్తూ శుక్రవారం బ్రెజిల్ అధ్యక్షుడు ఒక అభినందన సందేశాన్ని పంపారు. బోరిక్ను అభినందించిన లాటిన్ అమెరికన్ నేతల్లో బోల్సనారోనే చిట్టచివరి వ్యక్తి. అంతకుముందు బోల్సనారో ఎన్నికల ఫలితాల గురించి ఒక వ్యాఖ్య చేశారు. దాదాపు సగం మంది జనాభా ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. మిగిలిన సగంలో 55శాతం బోరిక్‌కు, 45శాతం కాస్ట్‌కు వచ్చాయని అన్నారు. దానిపై బోరిక్ స్పందిస్తూ తాము భిన్నమని స్పష్టంగా వెల్లడైందని అన్నారు. జనవరి చివరి వారం వరకు కేబినెట్ పేర్లు వెల్లడించేది లేదని చెప్పారు. దేశానికి ఏది ఉత్తమమో దాన్నే తాము అందిస్తామని, అత్యుత్తమమైన వారితోనే మంత్రివర్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు.