Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రెంచి గుయానా నుండి వెబ్ టెలిస్కోప్ ప్రయోగం
- విశ్వం గుట్టు విప్పే
వాషింగ్టన్ : ఎన్నో సందేహాలు, ప్రశ్నలు, మిస్టరీలకు నిలయమైన ఈ విశ్వాంతరాళం గుట్టు విప్పేందుకు నాసా విప్లవాత్మకమైన కొత్త రోదసీ టెలిస్కోప్‌ను ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5.50గంటలకు ఫ్రెంచ్ గుయానా నుంచి ఎరియానా-5 రాకెట్ జేమ్స్ వెబ్ రోదసీ టెలిస్కోప్‌ను విజయ వంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. వివిధ దశలను దాటుకుని నిర్దేశిత కక్ష్యలోకి చేరేందుకు ఈ టెలిస్కోప్‌కు దాదాపు నెల రోజులు పడుతుంది. ఈ ప్రయోగంతో ఖగోళ అన్వేషణలో కొత్త అధ్యాయం మొదలవుతుందని భావిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ నిర్మా ణానికి మొత్తంగా 900కోట్ల డాలర్లు (దాదాపు రూ.73 వేల కోట్లు) ఖర్చయింది. అమెరికా, యూరప్, కెనడా అంతరిక్ష పరిశోధనా సంస్థల సంయుక్త సహకారంతో ఇది రూపొందింది. పదేళ్ల వరకు పనిచేసేలా దీన్ని రూపొందించారు. ఈ ప్రయోగాన్ని నాసా, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్ఎ)లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. 14వేల పౌండ్ల బరువున్న ఈ టెలిస్కోప్ నింగిలోకి వెళ్లిన 26 నిముషాల తర్వాత రాకెట్ నుండి విడివ డింది. క్రమంగా ముందుకెళుతున్న కొద్దీ 13 రోజుల తర్వాత టెన్నిస్ కోర్టు పరిమాణం మేరకు విచ్చుకుంటుంది. అక్కడ నుండి మరో రెండు వారాలు గడిచిన తర్వాత వెబ్ టెలిస్కోప్, సౌర కక్ష్యలో తన గమ్యాన్ని చేరుకుంటుంది. ఇది, భూమి నుండి దాదాపు 10లక్షల మైళ్ల దూరంలో వుంది. అంటే చంద్రుని కన్నా నాలుగు రెట్లు దూరంలో వుంటుంది. 30ఏళ్ల క్రితం ప్రయోగించిన హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ తరహాలోనే వెబ్ టెలిస్కోప్ కూడా 340 మైళ్లదూరం నుండి భూమి చుట్టూ తిరుగుతుంది. హబుల్ టెలిస్కోప్ కన్నా వంద రెట్లకు పైగా సున్నితత్వం, కచ్చితత్వం కలిగిన వెబ్ టెలిస్కోప్ ఈ విశ్వం గురించి, అందులో మన స్థానం గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటివరకు వున్న అవగాహనలను కూడా మార్చేస్తుందని భావిస్తున్నారు. వెబ్ టెలిస్కోప్ ప్రధానంగా ఇన్ఫ్రా రెడ్ స్పెక్ట్రమ్‌లోని కాస్మోస్ కిరణాలను వీక్షిస్తుంది. తద్వారా వాయువులు, దుమ్ము ధూళి మేఘాలను చీల్చుకుని నక్షత్రాల ఆవిర్భవాన్ని చూసేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఈ టెలిస్కోప్‌లో ఏర్పాటు చేసిన బంగారపు పూత పూసిన బెరీలియం లోహపు అద్దం సుదూరంలోని లక్ష్యాలను కూడా పరిశీలించడానికి వీలు కల్పిస్తుంది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఇన్ఫ్రారెడ్ విజన్‌తో కాస్మోస్ కిరణాల సమగ్ర అవలోకన జరుపుతుంది. హబుల్ టెలిస్కోప్ బిగ్‌బ్యాంగ్ తర్వాత 400మిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్లి చూడగా, ఈ కొత్త వెబ్ టెలిస్కోప్ 1380కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తుందని అంచనా వేస్తున్నారు.