Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : సాధారణంగా క్రిస్మస్ వేడుకల సందర్భంగా విమానాశ్రయాలు అత్యంత రద్దీగా మారుతుంటాయి. అయితే అమెరికా, బ్రిటన్ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విరుచుకుపడటంతో.. వారాంతంలో ప్రపంచవ్యాప్త విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒమిక్రాన్ నేపథ్యంలో సిబ్బంది విధులకు హాజరుకావడం లేదని సంస్థలు తెలిపాయి. శుక్రవారం నుండి ప్రపంచవ్యాప్తంగా సుమారు 11,500 విమానాలు రద్దయ్యాయి. మరో పదివేల విమానాలు రద్దు కానున్నాయని విమాన సంస్థలు తెలిపాయి. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల సిబ్బంది కొరతకు దారితీసిందని వెల్లడించాయి. సోమవారం ఒక్కరోజే మూడు వేల విమానాలు రద్దు కాగా, మంగళవారం నాటికి ఆ సంఖ్య 1100కి చేరిందని వెల్లడించాయి.
వ్యాక్సిన్ వేయించుకోని వారితో పాటు భారీ ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం తగ్గడంతో అమెరికాలో కేసులు జనవరిలో రికార్డు స్థాయికి చేరుకోనున్నట్లు నిపుణులు తెలిపారు. కేసుల ఉధృతిని ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని, భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ స్వల్ప లక్షణాలున్న కరోనా బాధితుల క్వారంటైన్‌ను 10 రోజుల నుండి ఐదు రోజులకు తగ్గించింది.
అలాగే మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. కొన్ని దేశాలు ప్రయాణికులను అనుమతిస్తున్నా.. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగెటివ్ రిపోర్టు కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అలాగే, మరికొన్ని దేశాలు మళ్లీ క్వారంటైన్‌ను అమలు చేస్తున్నాయి.