Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఇమ్మిగ్రెంట్యేతర వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలన్న అమెరికా కొత్త విధానం శుక్రవారం నుండి అమల్లోకి వస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ తేదీ కోసం ఏడాదికి పైగా కూడా వేచి వుండాల్సి వస్తున్నందున ఆ సమయాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. కోవిడ్ మహమ్మారి కారణంగా వీసా ప్రాసెసింగ్ సామర్ధ్యం కూడా బాగా తగ్గిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయంగా ప్రయాణాలు తిరిగి పుంజుకుంటున్నందున, ఈ తాత్కాలిక చర్యలను తీసుకుంటున్నామని ఆ ప్రకటన తెలిపింది. జాతీయ భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూనే వీసా ఇంటర్వ్యూ కోసం వేచి వుండే సమయాన్ని బాగా తగ్గించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. దాదాపు 12 రకాల వీసా కేటగిరీలకు ఇంటర్వ్యూలు రద్దు కానున్నాయి. వీటిలో హెచ్-1బి వీసాలు, విద్యార్ధి వీసాలు, తాత్కాలికంగా వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ విజిటర్స్, అథ్లెట్లు, కళాకారులు, ఇలా పలు రకాల వీసాలకు ఇంటర్వ్యూలు రద్దు చేసే తాత్కాలిక అధికారం అమెరికా కాన్సులార్ అధికారులకు శుక్రవారం నుండి రానుంది. అయితే ఒక్కొక్క కేసు ప్రాతిపదికన, స్థానిక పరిస్థితులను బట్టి ఇంటర్వ్యూల విషయంలో అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లు నిర్ణయం తీసుకోవచ్చు. వీసా కాలపరిమితి ముగియడానికి 48నెలల ముందుగా అదే వీసా క్లాస్లో వీసాను పునరుద్ధరించుకునేందుకు నిర్వహించే ఇంటర్వ్యూలను రద్దు చేసే అధికారాన్ని కూడా నిరవధికంగా పొడిగించారు.