Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు కాల్పుల్లో మరణించిన ఘటనపై పెరూ అధ్యక్షుని నిర్ణయం
లిమా : గతేడాది నిరసనల సందర్భంగా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఇద్దరు పెరూ రైతుల కుటుంబ సభ్యులకు అధ్యక్షుడు పెడ్రో కేస్టిల్లో ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ ఆందోళనల ఫలితంగానే, అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే అధ్యక్షుడు మాన్యుయల్ మెరినో ఆనాడు రాజీనామా చేయాల్సి వచ్చింది. గతేడాది డిసెంబరు 20, 30 తేదీల మధ్య కాలంలో లా లిబర్టాడ్, ఎల్సిఎ ప్రాంతాల్లో వ్యవసాయ సమ్మె సందర్భంగా జరిగిన ఆందోళనల్లో ఈ రైతులు ఇద్దరు మరణించారని, వారికి 10వేల డాలర్లు చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన డిక్రీ తెలిపింది. ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని పోలీసు అధికారి కాల్పులు జరపగా ఒక వ్యక్తి మరణించడాన్ని ఒక ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఆ చిత్రానికి జాతీయ జర్నలిజం అవార్డు కూడా వచ్చింది. ఈ సంఘటనపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో పెరూవియన్ నేషనల్ పోలీస్ (పిఎన్పి) సభ్యులు నేరుగా తీసుకున్న చర్యల ఫలితంగానే ఇరువురు యువకులు మరణించినట్లు తేలింది.
ప్రదర్శనలను నియంత్రించడానికి నిషేధించిన మందుగుండు సామాగ్రిని ఈ సందర్భంగా వారు ఉపయోగించారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారికి గాయాల తీవ్రతను బట్టి 3,744 డాలర్ల నుండి 10వేల డాలర్ల వరకు నష్టపరిహారం అందచేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా బాధితులకు 2లక్షల డాలర్ల వరకు పెరూ ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తంగా రాజకీయ నేతలకు ఆదర్శప్రాయంగా వుండేలా అధ్యక్షుడుగా ఎన్నికైన పెడ్రో కేస్టిలో తనకు వచ్చే అధ్యక్ష వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, గతంలో చేసిన టీచరు వేతనాన్నే తీసుకోవాలని నిర్ణయించారు.