Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణ మంత్రితో అబ్బాస్ చర్చలు
విశ్వాస పునరుద్ధరణ చర్యలపై దృష్టి
జెరూసలేం : 11ఏండ్ల తర్వాత మొదటిసారిగా పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఇజ్రాయిల్‌లో పర్యటి స్తున్నారు. మంగళవారం ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్ళిన అబ్బాస్ తొలుత ఇజ్రాయిల్ రక్షణ మంత్రితో చర్చలు జరిపారు. కాగా, అబ్బాస్‌తో శాంతి చర్చలు జరిపేది లేదని ఇజ్రాయిల్ నూతన ప్రధాని నఫ్తాలి బెర్నెట్ స్పష్టం చేశారు. పాలస్తీనా స్వాతంత్య్రాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, పాలస్తీనా అథారిటీతో ఘర్షణలను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో జీవన పరిస్థితులను మెరుగుపరచాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నేతలెంతగా హామీలిచ్చినా ఇటీవలి కాలంలో వెస్ట్ బ్యాంక్‌లో హింస పెరిగింది. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయిల్ సెటిలర్ల దాడులు పెరిగాయి. సెంట్రల్ ఇజ్రాయిల్‌లో రక్షణ మంత్రి బెన్నీ గంట్జ్ నివాసంలో మంగళవారం అర్ధరాత్రి సమావేశం జరిగినట్లు పాలస్తీనా సీనియర్ అధికారి తెలిపారు. 2010 తర్వాత మొదటిసారిగా ఇజ్రాయిల్ అధికారితో అబ్బాస్ సమావేశమయ్యారని చెప్పారు. విశ్వాస పునరుద్ధరణ చర్యలను మరింత ముందుకు తీసుకెళ్ళాలన్నది తమ అభిమతమని చెప్పారు. అలాగే భద్రతా సమన్వయాన్ని కూడా మెరుగుపరచాలని భావిస్తున్నామన్నారు. అబ్బాస్ ప్రధాన సహాయకుడు హుస్సేన్ అల్ షేక్ మాట్లాడుతూ, ఒక రాజకీయ సమాంతర రేఖను సృష్టించడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. సెటిలర్ల పద్దతుల కారణంగా ఉద్రిక్త క్షేత్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. భద్రత, ఆర్థిక, మానవతా సమస్యలను సమావేశంలో చర్చించినట్టు చెప్పారు.