Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తైవాన్ వేర్పాటువాదులకు చైనా హెచ్చరిక
బీజింగ్ : హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని చైనా శనివారం తైవాన్ వేర్పాటువాదులను హెచ్చరించింది. తాము గీసిన లక్ష్మణరేఖలను దాటడానికి ప్రయత్నించినా, స్వాతంత్య్రం కోసం ఒత్తిడి తీసుకువచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో చైనా ప్రభుత్వ ప్రతినిధి మా గ్జియావో గుయాంగ్ మాట్లాడుతూ, తైవాన్ విషయంలో విదేశీ జోక్యం ఎక్కువవుతోందని అన్నారు. తైవాన్ జలసంధి పరిస్థితి వచ్చే ఏడాది నాటికి మరింత సంక్లిష్టంగా మారుతుందని అన్నారు. తైవాన్‌తో శాంతియుత పునరేకీకరణను చైనా కోరుకుంటోందని గుయాంగ్ స్పష్టం చేశారు. అయితే వేర్పాటువాదులు తమ కార్యకలాపాలను కొనసాగించినట్లైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 40ఏళ్ళలో ఎన్నడూ లేని రీతిలో చైనా, తైవాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయని తైవాన్ అధికారులు పేర్కొంటున్నారు. అమెరికా ఉద్దేశ్యపూర్వకంగానే కవ్వింపు చర్యలకు దిగుతోందని, తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని చైనా విమర్శిస్తోంది. గతేడాది అమెరికా, తైవాన్‌కు 1800కోట్ల డాలర్లు విలువ చేసే ఆయుధాల అమ్మకాలను ఆమోదించింది. తైవాన్ వేర్పాటువాదులకు రహస్యంగా శిక్షణ ఇచ్చేందుకు అక్కడ మోహరించిన అమెరికన్ సైనికులను తక్షణమే ఉపసంహరించాల్సిందిగా ఈ ఏడాది ప్రారంభంలో చైనా కోరింది.