Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా వ్యయం 14లక్షల కోట్ల డాలర్లు !
- వాల్‌స్ట్రీట్ జర్నల్ వార్తా కథనం
- లబ్ది పొందిన కాంట్రాక్టర్లు
- నిధుల వృధాపై విచారణకు బైడెన్ సర్కార్ ఆదేశం
వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్, మధ్య ప్రాచ్యంలో రెండు దశాబ్దాలుగా సాగించిన యుద్ధంలో అమెరికా మిలటరీ 14లక్షల కోట్ల డాలర్లను ఖర్చు పెట్టింది. ఈ యుద్ధం వల్ల ఆయుధాల తయారీదారులు, డీలర్లు, కాంట్రాక్టర్లు లబ్ది పొంది సుసంపన్నులయ్యారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్‌లో సవివరమైన నివేదిక వచ్చింది. 2001 సెప్టెంబరు 11నుండి అమెరికన్ మిలటరీ ఔట్‌సోర్సింగ్‌తో పెంటగన్ వ్యయం 14లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ మొత్తంలో మూడో వంతు నుండి సగం వరకు కాంట్రాక్టర్లకే వెళ్ళింది. ఎన్నడూ సాకారమవని, విజయవంతమవని ప్రాజెక్టులపై అమెరికన్లు చెల్లించే పన్ను మొత్తాలు ఏ విధంగా వృధా అవుతున్నాయో పలు ఉదాహరణలను ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని కెష్మెర మార్కెట్‌ను పెంపొందించేందుకు 9 ఇటలీ గొర్రెలను దిగుమతి చేసుకు ప్రాజెక్టుపై పెంటగన్ ఏకంగా 60లక్షల డాలర్లను ఖర్చు పెట్టింది. కానీ ఆ ప్రాజెక్టు ఎన్నడూ ఆ స్థాయిని అందుకోలేదు. లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్, బోయింగ్ కంపెనీ, జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్, రేథాన్ టెక్నాలజీస్ కార్పొరేషన్, నార్త్రోప్ గ్రుమ్మన్ కార్పొరేషన్ ఈ ఐదు రక్షణ రంగ కంపెనీలు ఆయుధాలు, సరఫరాలు, ఇతర సేవల కోసం సింహ భాగాన్ని అంటే 2.1లక్షల కోట్ల డాలర్లు తీసుకున్నాయి. బ్రౌన్ యూనివర్శిటీకి చెందిన కాస్ట్స్ ఆఫ్ వార్ ప్రాజెక్్ట, ఏరియా స్కాలర్లు, న్యాయ నిపుణులు, ఇతరుల నుండి ఈ వార్తా పత్రిక డేటాను సేకరించింది. అమెరికా జరిపిన యుద్ధాల వల్ల కనిపించని ప్రభావంపై వీరందరూ పనిచేస్తున్నారు. ఈ యుద్ధాల కారణంగా అతి బీదరికం నుండి సుసంపన్నులైన వారి కొన్ని కథనాలను కూడా ఈ నివేదిక ఇచ్చింది. సైనిక బలగాలకు దుప్పట్లు అందచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఆఫ్ఘన్ యువకుడు అనతికాలంలోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని పలు రంగాలకు విస్తరించాడు. టివి స్టేషన్, దేశీయ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలను స్థాపించాడు. ఇంధన వ్యాపారం ప్రారంభించిన కాలిఫోర్నియా వ్యాపారి కోట్లాది డాలర్లు ఆదాయంగా పొందాడు. ఓహియోకి చెందిన ఇద్దరు సైనిక గార్డులు అమెరికన్ సైన్యానికి ఆఫ్ఘన్ ఇంటర్ప్రెటెర్స్్ (భాష్యం చెప్పేవారు) సేవలను అందచేసే చిన్న వ్యాపారం మొదలు పెట్టారు. ఈనాడు వారు అమెరికా సైన్యంలోనే అతిపెద్ద కాంట్రాక్టర్లలో ఒకరిగా పేరొందారు. దాదాపు 400కోట్ల డాలర్లు విలువ చేసే కాంట్రాక్టులను పొందారు. యుద్ధరంగ కాంట్రాక్టర్లపై ఆధారపడడం వల్ల యుద్ధ వ్యయం ఏ రకంగా పలు రెట్లు పెరిగిందో నిర్ధారించేందుకు బైడెన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వృధా జరిగిన మొత్తాలు, అవినీతి వ్యవహారాలపై వందలాది నివేదికలను సిగార్ (ఆఫ్ఘన్ పునర్నిర్మాణంపై అమెరికా స్పెషల్ ఇనస్పెక్టర్ జనరల్) సేకరించింది.