Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన ఏడాది గడిచినప్పటికీ అమెరికన్లు తమ దేశ ప్రజాస్వామ్య పరిస్థితులపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే హింసాత్మక ఘటనలను సమర్థించవచ్చని మూడో వంతు మంది పేర్కొన్నట్లు మరో సర్వేలో తేలింది. ఈ రెండు సర్వేలకు సంబంధించి ఆదివారం స్థానిక పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. దేశంలో రాజకీయంగా హింసాత్మక వాతావరణం ఏర్పడటంతో ట్రంప్ మద్దతుదారుల నేతృత్వంలో క్యాపిటల్ భవనంపై గతేడాది జనవరి 6న దాడి జరిగిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు కొనసాగుతోందని మూడింట రెండొంతుల మంది పేర్కొన్నట్లు సిబిఎస్ న్యూస్ పోల్ చేపట్టిన సర్వేలో తేలింది. అమెరికాలో జాత్యహంకారం 2002లో 90 శాతం ఉండగా, ప్రస్తుతం 54 శాతానికి పడిపోయిందని మేరీలాండ్ యూనివర్శిటీ చేపట్టిన సర్వేలో తేలింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు కొన్ని శక్తులను వినియోగించవచ్చని 28 శాతం మంది పేర్కొనగా, ప్రభుత్వంపై హింసాత్మక చర్యలు కొన్ని సార్లు సమర్థించవచ్చని 38 శాతం మంది వాషింగ్టన్ పోస్ట్‌తో చెప్పారు. ఈ పరిస్థితులను అధిగమిస్తానని క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన 14 రోజుల అనంతరం అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోబైడెన్ వాగ్దానం చేసినప్పటికీ.. భిన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయని సర్వేలో తేలింది. ట్రంప్ మద్దతుదారుల్లో మూడింటరెండొంతుల మంది బైడెన్ చట్టబద్ధంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు కాదన్న నిరాధారమైన అరోపణలను విశ్వసిస్తున్నారు. దాడికి ట్రంప్‌దే బాధ్యత అని సుమారు 60 శాతం మంది వాదిస్తున్నట్లు సర్వేలో తేలింది.