Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు అణ్వస్త్ర దేశాల నేతల సంయుక్త ప్రకటన
బీజింగ్ : అణు యుద్ధాన్ని నివారించి, ఆయుధ పోటీని విడనాడేందుకు చర్యలు తీసుకోవాలని, వాటిని దృఢ నిశ్చయంతో అమలు చేయాలని ఐదు అణ్వాయుధ దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా నేతలు నిర్ణయించారు. దీనిపై సోమవారం వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడం, వ్యూహాత్మక ముప్పులను తగ్గించుకోవడం అత్యంత ప్రాధాన్యత గల బాధ్యతలుగా వుండాలని నేతలు భావించారు. అణు యుద్ధంలో ఎన్నడూ విజయం సాధించలేమని, అందువల్ల ఎన్నడూ అణ్వాయుధాలతో పోరాడరాదని వారు ఆ ప్రకటనలో పునరుద్ఘాటించారు. అణ్వాయుధాలు వున్నంతవరకు అవి రక్షణ ప్రయోజనాలకే ఉపయోగపడాలని అన్నారు. దురాక్రమణను అడ్డగించేందుకు, యుద్ధాన్ని నివారించేందుకు ఉపయోగపడాలన్నారు. ఇటువంటి ఆయుధాలు మరింతగా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఐదు దేశాల నేతలు గట్టిగా అభిప్రాయపడ్డారు. అణ్వస్త్రవ్యాప్తి నిరోధకత, నిరాయుధీకరణ, ఆయుధ నియంత్రణకు సంబంధించి ద్వైపాక్షిక, బహుళపక్ష ఒప్పందాలు, హామీల అమలుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను ఆ ప్రకటన పునరుద్ఘాటించింది. సాధ్యమైనంత త్వరగా అణ్వాయుధ పోటీని విడనాడేందుకు సంబంధించి సమర్ధవంతమైన, విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అందుకోసం చర్చలు చేపట్టాలని ఆ ప్రకటన కోరింది. అణ్వాయుధాలను అనధికారికంగా లేదా అనాలోచితంగా ఉపయోగించడాన్ని నివారించేందుకు దేశాల స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను బలోపేతం చేయాలని భావించారు.
యుద్ధ నైపుణ్యాల్లో అరితేరండి ! :సైనిక బలగాల శిక్షణా కార్యక్రమానికి జిన్‌పింగ్ ఉత్తర్వులు
సాయుధ బలగాల శిక్షణా కార్యక్రమానికి మొబిలైజేషన్ ఆర్డర్‌పై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం సంతకం చేశారు. కొత్త ఏడాదిలో సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) మొదటి ఉత్తర్వులు ఇవి. ఈ ఆదేశాలతో ఈ ఏడాది సైనిక శిక్షణ ప్రారంభమవుతుంది. సిఎంసి, పార్టీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను, రూపొందించిన ప్రణాళికలను సాయుధ బలగాల్లోని ప్రతి ఒక్కరూ కచ్చితంగా అమలు చేయాల్సి వుంటుందని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి. మారుతున్న దేశ భద్రతా దృశ్యాన్ని, నెలకొన్న పోరాట పరిస్థితులను స్పష్టంగా అందరూ అర్ధం చేసుకోవాల్సి వుందని ఆ ఆదేశాలు పేర్కొన్నాయి. కొత్తగా వస్తున్న సాంకేతికత, యుద్ధనైపుణ్యాలు, ప్రత్యర్ధుల శక్తి సామర్ధ్యాలు అన్నింటినీ సాయుధబలగాలు నిశితంగా పరిశీలిస్తూ వుండాలని, పోరాట కార్యకలాపాలతో పాటు మెరుగైన శిక్షణను తీసుకోవడానికి మరింత కృషి జరపాలని ఆ ఉత్తర్వులు కోరాయి. వ్యవస్థాగత శిక్షణను బలోపేతం చేసుకోవడం, కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా సుసంపన్నమైన బలగంగా అభివృద్ధి చెందాలని, తద్వారా యుద్ధాల్లో పోరాడి, గెలుపొందే సామర్ధ్యాలను స్వంతం చేసుకోవాలని ఉత్తర్వులు కోరాయి. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించాలని, చివరకు చావుకైనా తెగించాలని, అధికారులు, సైనికులు అందరూ ఆ స్ఫూర్తిని పరిరక్షించాలని కోరింది. మరింత క్రియాశీలంగా, పకడ్బందీగా, సురక్షితమైన పద్దతిలో శిక్షణను నిర్వహించుకోవాలని, పోరాట సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని, అద్బుతమైన పనితీరును కనబరచాలని ఉత్తర్వులు పేర్కొన్నాయి.