Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల కాల్పుల్లో 12 మంది మృతి.. 300 మందికి పైగా గాయాలు
- ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు
- రాజీనామా చేసిన ప్రభుత్వం
- అధ్యక్ష నివాసానికి నిప్పంటించిన ఆందోళనకారులు
ఆల్మటీ : అత్యంత సుస్థిర దేశంగా భావించే సెంట్రల్ ఆసియాలోని పూర్వపు సోవియట్ రిపబ్లిక్ల్లో ఒకటైన కజకిస్థాన్ భగ్గుమంది. ఇంధన ధరల పెంపుపై బుధవారం దేశవ్యాప్తంగా తలెత్తిన ఆందోళనలు, హింస నేపథ్యంలో అధ్యక్షుడు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. రెండు వారాల పాటు ఈ ఎమర్జన్సీ అమల్లో వుంటుందని తెలిపారు. ఇంధన వనరులు సమృద్ధిగా గల ఈ దేశం దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇంధన ధరల పెంపును తీవ్రంగా నిరసిస్తూ బుధవారం ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడ్డారు.
ఆల్మటీలోని అధ్యక్ష నివాసానికి, మేయర్ కార్యాలయ భవనానికి ఆందోళనకారులు బుధవారం నిప్పంటించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. గడ్డ కట్టే చలిలో కూడా జల ఫిరంగులను, బాష్పవాయు గోళాలను, గ్రెనెడ్లను ప్రయోగించారు. కాగా ఈ అశాంతికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం రాజీనామా చేసింది. అధ్యక్ష నివాసం వెలుపల వేలాదిమంది ప్రదర్శకులు గుమిగూడిన కొద్ది గంటల తర్వాత భవనానికి నిప్పంటించినట్లు రష్యా టాస్ వార్తా సంస్థ తెలిపింది. మిర్ టెలివిజన్ కేంద్రంపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. అక్కడి పరికరాలను నాశనం చేశారు.
ఎన్ఫోర్స్్మెంట్ యంత్రాంగంపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని, పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది చనిపోయారని కథనాలు వస్తుంటే.. కాదు అధికారులు, నేషనల్ గార్డు సభ్యులు మరణించారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనల్లో 300మందికి పైగా గాయపడ్డారని అధ్యక్షుడు కసామ్ జోమార్ట్ టొకెయెవ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత కఠినంగా వ్యవహరించాలని భావించామని, ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా అశాంతి, హింస నెలకొన్న నేపథ్యంలో 200మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కఠిన చర్యల్లో భాగంగానే ఇంటర్నెట్ సేవలను స్తంభింప చేశారు. దాంతో ఎక్కడేం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గురువారం తెల్లవారు జామునకు ఆల్మటీలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించారు. కజకస్థాన్ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని మనందరం కలిసి అధిగమించాలని అధ్యక్షుడు కోరారు.
కొత్త సంవత్సరంలో ఎల్పిజి ధరలను పెంచడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. చమురు, గ్యాస్ ఎగుమతులు చేసే దేశం, అపారంగా ఇంధన నిల్వలు కలిగిన దేశం ఈ రీతిన ధరలు పెంచడం అన్యాయమని విమర్శిస్తూ వేలాదిమంది ప్రజలు ఆల్మటీ సహా పలు నగరాల్లో వీధుల్లోకి వచ్చారు. వాహన ఇంథనంగా ఉపయోగించే ఎల్పిజి ధరలను దాదాపు రెట్టింపు చేయడంతో ప్రజలు భగ్గుమన్నారు. 1991లో సోవియట్ యూనియన్ నుండి విడిపోయి స్వాతంత్య్రం ప్రకటించుకున్నది. ఆ తర్వాత నుంచి ఒకే పార్టీ పాలనలో వుండడంతో దేశ ప్రజల్లో అసంతృప్తి ఎంత తీవ్రంగా వుందో దీంతో వెల్లడైంది.
శాంతి పరిరక్షక బలగాలను మోహరించనున్న సీఎస్టీఓ
దేశంలో పరిస్థితులను అదుపులోకి తేవడంలో సాయం కావాలని అధ్యక్షుడు కోరినందున ఆ దేశానికి శాంతి పరిరక్షక బలగాలను పంపాలని సీఎన్టీఓ (సమిష్టి భద్రతా ఒప్పంద సంస్థ-కలెక్టివ్ సెక్యూరిటీ ట్రియటీ ఆర్గనైజేషన్) సెక్యూరిటీ కౌన్సిల్ గురువారం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్మేనియా ప్రధాని, కౌన్సిల్ చైర్మెన్ నికోల్ పషిన్యాన్ తెలిపారు. ఆ దేశంలో సుస్థిర పరిస్థితులు నెలకొనేవరకు పరిమిత కాలం పాటు ఈ బలగాలు అక్కడ వుంటాయని తెలిపారు.