Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరస్ తనను తాను మార్చుకొని..శక్తివంతమవుతుంది..
- శ్వాసనాళాల్లో ఒమిక్రాన్ ఒకచోట ఆగుతోంది..
- వైరస్ ప్రవర్తనపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు..
- టీకా పంపిణీ అత్యంత ముఖ్యం : భారత సంతతి బ్రిటన్ సైంటిస్ట్ రవీంద్ర గుప్తా
లండన్ : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న 'ఒమిక్రాన్' వేరియెంట్‌ను తక్కువ అంచనా వేయొద్దని భారత సంతతి బ్రిటన్ సైంటిస్ట్ రవీంద్ర గుప్తా చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ వర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన ఒమిక్రాన్ వేరియెంట్‌పై బ్రిటన్‌లో అధ్యయన బృందానికి నేతృత్వం వహించారు. బ్రిటన్‌లో కరోనా కొత్త కేసులు, మూడోవేవ్‌కు కారణం ఒమిక్రాన్. ఇది రోగి ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తోందని అక్కడి వైద్యులు గుర్తించారు. ''వైరస్ తన స్వరూపం మార్చుకొని క్రమ క్రమంగా బలహీనపడుతోంది..అనే భావనతో ఉన్నాం. అది తప్పు. సార్స్-కోవ్-2ను కోవిడ్-19గా పేర్కొంటాం. ఇది ఎంత వేగంగా విస్తరిస్తున్నది? అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. వైరస్ బలహీనపడుతోంది..అనడానికి శాస్త్రీయ ఆధారాలు కనపడటం లేదు. వైరస్ తన స్వరూపాన్ని మార్చుకుంటూ వెళ్తోంది'' అని రవీంద్ర గుప్తా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
మొదటి రక్షణ గోడ టీకానే
ఒమిక్రాన్..అంత ప్రమాదకారి కాదని తేలింది. ఇదొక శుభవార్తే. అయితే మరో వేరియెంట్ బలహీనమైంది రావాలనే లేదు. ఒమిక్రాన్ కంటే బలమైంది రావొచ్చు! రాకపోవచ్చు! ఇలాంటి తరుణంలో మనం చేయగలిగింది..వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటమే. వైరస్‌బారిన పడ్డవారి ఆరోగ్యం సుదీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి లోనవుతుంది. బ్రిటన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా బృందాలకు మేం చెప్పింది ఒక్కటే. అదేంటంటే..టీకా పంపిణీ సమర్థవంతంగా అమలుజేయాలని.
అన్ని దేశాల చూపు ఇప్పుడే భారత్‌పైనే
ఒమిక్రాన్ వేరియెంట్ భారత్‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందా? అని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ్నుంచి వచ్చే అనుభవాలే..ఇతర దేశాల్లో తీసుకునే ముందస్తు చర్యలు ఆధారపడతాయి. అమెరికా, యూరప్‌లో తయారైన వ్యాక్సిన్, భారత్ తయారీ వ్యాక్సిన్ ఫలితాలపైనా ఒక అంచనాకు రావొచ్చు. జన్యుపరంగా కూడా ఎలాంటి ప్రభావం ఉంటోందన్న సమాచారమూ తెలుస్తుంది. డెల్టా వేరియెంట్ తర్వాత భారత్‌లో వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక ఏర్పడింది. రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోస్ ఇవ్వాలా? వద్దా ? అన్నది ఇప్పుడే చెప్పలేం. అణగారిన వర్గాల్లో, పేదల్లో వ్యాక్సిన్ తీసుకోనివారిపై ఒమిక్రాన్ ప్రభావ ముంటుంది. వీరు వైరస్‌బారిన పడకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
ఎక్కడ చేరుతోంది?
రోగి ఊపిరితిత్తులు, శ్వాసనాళల లోపలి భాగాలకు వెళ్లగలిగే అవకాశమున్నా ఒమిక్రాన్ అలా వెళ్లటం లేదు. భిన్నంగా ప్రవర్తిస్తోందని మా అధ్యయనంలో తేలింది. టీఎంపీఆర్ఎస్ఎస్2.. అనే కణజాలం వద్దే ఆగిపోతోంది. లేదా టీఎంపీఆర్ఎస్ఎస్2 ఆపుతోందని అనుకోవచ్చు. ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో చాలా లోతుగా వెళ్లకుండా టీఎంపీఆర్ఎస్ఎస్2 వద్దే ఆగిపోవటంతో ఒమిక్రాన్ అంత సీరియస్ కాదనే అంచనాకు వచ్చాం. ఒకవేళ ఊపిరితిత్తులు, శ్వాసనాళాల లోపలి భాగాల్లోకి చొరబడితే రోగికి ఆక్సీజన్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతంది. వైరస్ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.