Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19మంది దుర్మరణం వీరిలో 9మంది చిన్నారులే
న్యూయార్క్ : న్యూయార్క్ నగరంలో బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదంలో 19మంది మరణించారు. వీరిలో 9మంది చిన్నారులు వున్నారు. మరో 30మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 9మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఎలక్ట్రిక్ స్పేస్ హీటర్ సరిగా పనిచేయకపోవడం వల్ల మంటలు చెలరేగాయి. ఒక అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో ఈ హీటర్ కారణంగా రేగిన మంటలు వెంటనే ఆ గదినిండా, తర్వాత మొత్తంగా అపార్ట్మెంట్ అంతా వ్యాపించాయి. న్యూయార్క్ నగర చరిత్రలోనే అత్యంత అధ్వాన్నమైన అగ్నిప్రమాదాల్లో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. 19 అంతస్తుల ఈ భవనంలో ఆదివారం ఉదయం దాదాపు 11గంటల సమయంలో మంటలు రేగి ప్రమాదం సంభవించింది. దాదాపు 200మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి పోరాడాల్సి వచ్చిందని న్యూయార్క్ నగర అగ్నిమాపక విభాగం తెలిపింది. ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చిన మూడు నిముషాలకే తాము ప్రమాద స్థలంలో వున్నామని పేర్కొంది. ఆ ప్రాంతమంతా దట్టమైన మంటలు, పొగతో నిండిపోయిందని అగ్నిమాపక దళ కమిషనర్ డేనియల్ తెలిపారు. మొత్తంగా భవనంలోని అన్ని అంతస్తులు పొగతో నిండిపోయిందని, ప్రతి అంతస్తులో, మెట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ స్పృహ తప్పి పడిపోయి వున్నారని, వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించామని తెలిపారు. ప్రాణాపాయ పరిస్థితుల్లోనే 32మందిని ఆస్పత్రుల్లో చేర్చినట్లు తెలిపారు. మన నగరంలో ఇలాంటి సంఘటన కనివినీ ఎరుగనిదని అన్నారు. పొగ దట్టంగా కమ్ముకోవడంతో అక్కడ నుండి తప్పించుకోవడానికి కూడా చాలామందికి వీల్లేక పోయింది. కొద్ది రోజుల క్రితం ఫిలడెల్ఫియాలో అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12మంది మరణించారు. వీరిలో 8మంది పిల్లలే వున్నారు. ఊహకందని విషాదంగా న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆదమ్స్ అభివర్ణించారు. ప్రమాదం జరిగిన భవనంలో ప్రధానంగా ముస్లింలు ఎక్కువగా వున్నారని, వీరిలో ఆఫ్రికాలోని గాంబియా నుండి వచ్చినవారే చాలామంది వున్నారని మేయర్ తెలిపారు. ఆధునిక చరిత్రలో ఇదొక భయంకరమైన, బాధాకరమైన క్షణంగా నిలిచిపోతుందని ఆదమ్స్ పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు. మొత్తంగా నగరం దిగ్భ్రాంతిలో వుండిపోయిందని గవర్నర్ కేథీ హోచల్ వ్యాఖ్యానించారు. బాధితుల నష్టపరిహార నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వారికి కొత్త ఇళ్ళ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. 50ఏళ్ళనాటి ఈ భవనంలో 120 అపార్ట్మెంట్లు వున్నాయి.