Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటాడుతున్న ఒమిక్రాన్ భయం
- వణుకుతున్న ప్రపంచం
- అమెరికాలో ఒక్కరోజే 11 లక్షలకుపైనే కోవిడ్ కేసులు
కాలిఫోర్నియా : కొత్తవేరియంట్ ఒమిక్రాన్ విజృంభి స్తున్న తీరుతో..ప్రపంచమంతా వణుకుతోంది. దాదాపు అన్ని దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్ హడలెత్తిస్తోంది. ఈనెల తొలివారంలోనే కోటి కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అధిక మ్యుటేషన్లు, రోగనిరోధక రక్షణ నుంచి తప్పించుకునే సామర్థ్యం, శ్వాసకోశ దిగువ భాగంలో ప్రతిరూపాలు ఎక్కువగా ఉండడం వల్లే వైరస్ ఉధృతికి ప్రధాన కారణాలుగా గుర్తించిన విషయం విదితమే.అయితే ఈ వేరియంట్ వల్ల స్వల్ప లక్షణాలే కనిపించడం ఊరట కలిగించే విషయమైనా.. ఆస్పత్రి చేరికలు పెరుగుతున్న తీరుపై.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళనవ్యక్తం చేసింది. కొత్త వైరస్ కట్టడికి అన్ని దేశాలు ముమ్మర చర్యలు చేపట్టాలని సూచించింది.
అమెరికాలో వామ్మో...
కరోనా కేసుల ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. రోజూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్కరోజే అమెరికాలో 11లక్షల కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు జనవరి 3న ఒకేరోజు 10లక్షల కేసులు బయటపడ్డాయి. తాజాగా ఆస్పత్రి చేరికలు కూడా భారీగా నమోదయ్యాయి. ఒకేరోజు లక్షా 35వేల మంది ఆస్పత్రిలో చేరినట్టు నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. ఇక రోజువారీ కేసుల్లో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఈ తరహా కేసులు నమోదు కాకపోవటం విశేషం.
వాషింగ్టన్ డీసీ, విస్కాన్సిన్, వర్జీనియా, డెలావేర్, ఇలినోయిస్, మేరీల్యాండ్, మిస్సౌరి, పెన్సిల్వేనియాతోపాటు పలు రాష్ట్రాల్లో ఆస్పత్రి చేరికలు అధికంగా ఉన్నాయి. వైరస్ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్లు పెరిగితే వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.