Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మరణాల సంఖ్యను భారత్ తక్కువ చేసి చూపుతోంది..
- భారత్ అధికారిక సమాచారం లేకుండానే ప్రపంచ నివేదిక విడుదల
- రెండో వేవ్‌లో అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 4లక్షలు
- కానీ వాస్తవంగా 34 లక్షల మంది చనిపోయారు : ప్రభాత్ ఝా
టొరొంటో : కోవిడ్‌కు సంబంధించి భారత ప్రభుత్వం విడుదల చేసే సమాచా రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వసించటం లేదని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ప్రభాత్ ఝా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో వేవ్‌లో కోవిడ్ మరణాల సంఖ్యను భారత్ చాలా తక్కువ చేసి చూపిందని, దాదాపు 34లక్షల కోవిడ్ మరణాలు నమోదుచేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. టొరొంటో లోని సెయింట్ మైఖేల్ హాస్పిటల్‌లోని సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ రీసెర్చ్‌కు డైరెక్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన నేతృత్వంలో జరిగిన అధ్యయనానికి సంబంధించిన వివరాలు జనవరి 7న మీడియాకు విడుదల చేశారు. కోవిడ్ మరణాల సమాచారాన్ని భారత్ దాస్తోం దని ఈ అధ్యయనంలో ఆయన పేర్కొ న్నారు. రెండో వేవ్ ఉధృతంగా ఉన్న ఏప్రిల్ 1, 2020-జులై 1, 2021 మధ్యకాలంలో అధికార లెక్కలతో పోల్చితే ఏడు.. ఎనిమిదిరెట్లు ఎక్కువగా కోవిడ్ మరణాలున్నాయని తెలిపారు. సుమారు గా 4లక్షల మరణాలు చోటుచేసు కున్నా యని అధికార లెక్కలు చూపుతున్నాయని, కానీ వాస్తవానికి 31లక్షల నుంచి 34లక్షల వరకూ కోవిడ్‌మరణాలు ఉన్నాయని తమ అధ్యయనం తెలుపుతోందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఒక న్యూస్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే..
స్వతంత్ర అధ్యయనం
భారత్ కోవిడ్ మరణాలపై మూడు స్వతంత్ర అధ్యయనాలు జరిగాయి. వీటి ఆధారంగానే మా బృందం (నాలుగు నెలలకాలంలో ఏప్రిల్-జులై 2021) 34లక్షల మంది కోవిడ్‌తో చనిపోయారనే నిర్ధారణకు వచ్చాం. లక్షలాది కుటుంబాలపై ఒపీనియన్ పోల్ జరగగా, ఏప్రిల్ 2021లో మరణాల సంఖ్య భారీ పెరిగినట్టు గుర్తించాం. మృతుల కుటుంబ సభ్యులే ఆ విషయం చెప్పారు. కోవిడ్ మరణాల్ని ప్రభుత్వం ఎక్కడా రికార్డు చేయకపోవటంతో ఒపీనియన్ పోల్ ద్వారా సమాచారాన్ని సేకరించాం. భారత్‌లో దాదాపు 200 ప్రభుత్వ హాస్పిటల్స్ సమాచారాన్నే కేంద్రం అధికారికంగా విడుదల చేస్తోంది.
ఈ హాస్పిటల్ నుంచి నమోదైన సమాచారంలో..కరోనా రాకముందు మరణాల సంఖ్య, మొదటివేవ్, రెండో సమయంలో మరణాల సంఖ్యలో పెద్దగా తేడా లేదు. దీనినిబట్టి అధికారిక సమాచారం మరణాల సంఖ్యను దాస్తోందన్నది తెలుస్తోంది. మూడో స్వతంత్ర అధ్యయనంలో భాగంగా జర్నలిస్టుల నుంచి డాటాను సేకరించాం. మూడు స్వతంత్ర అధ్యయనాల్లోనూ మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిన తీరును గుర్తించాం. కోవిడ్ మరణాల్ని ప్రభుత్వం ఎక్కడా కూడా పెద్దగా నమోదుచేయటం లేదన్నది గుర్తించాం. భారత్‌లో 2020లో వచ్చిన మొదటి వేవ్ కొన్ని పట్టణాలకే పరిమితమైంది. ఆ తర్వాత 2021లో వచ్చిన రెండో వేవ్ పట్టణాలకు, గ్రామాలకు కూడా విస్తరించటమే మరణాల సంఖ్య భారీగా పెరగడానికి కారణమైంది. బ్రెజిల్, కొలంబియా, అమెరికాలో జరిగినట్టుగానే వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారత్‌లోనూ ఉందని భావిస్తున్నాం. అయితే మరణాల సంఖ్య ఇతర దేశాల్లో ఉన్నట్టుగా భారత్‌లో లేదని ప్రజలు అనుకునేలా ప్రభుత్వ సమాచారం ఉంది.
విశ్వసనీయత లేదు
భారత్‌లో ఒక్కసారిగా వైరస్ విజృంభించినట్టు ఇతర దేశాల్లో లేదు. వైరస్ సునామీ ట్రెండ్ భిన్నంగా ఉంది. ఉదాహరణకు బ్రెజిల్లో వైరస్ పలుమార్లు విజృంభించింది. డెల్టా వేరియెంట్ దీనికి కారణం. అమెరికాలోనూ 20శాతం వరకు కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపారు. భారత్‌లో చాలా పెద్ద సంఖ్యలో తక్కువ చేసి విడుదల చేశారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన సమాచారంలో భారత్ అధికారిక లెక్కల్ని పరిగణలోకి తీసుకోలేదు.
కరోనా వైరస్ మనిషి ప్రాణాన్ని కచ్చితంగా తీస్తుందని వైద్యపరంగా నిరూపణ అయ్యింది. అయితే భారత్‌లో దీనిపై ఆయా రాష్ట్రాల నుంచి విడుదలవుతున్న గణాంకాలు చాలా పరిమితమైనవి. కేవలం ఆర్‌పీసీఆర్ టెస్ట్‌లు..అందులో పాజిటీవ్‌లు ఎన్ని ఉన్నాయన్నది మాత్రమే బయటకు వస్తోంది. ఈ సమాచారం ఆధారంగా వైరస్ వ్యాప్తి తెలుసుకోలేం. అందువల్లే రెండోవేవ్‌లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్..తదితర రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ.కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను భారత ప్రభుత్వం కావాలనే దాస్తోంది. వాస్తవాలు బయటకు వస్తే అది రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని వివిధ దేశాల్లో ప్రభుత్వాలు భావిస్తున్నాయి. భారత్‌లోనూ అదే జరుగుతోంది. అందుకే భారత్ విడుదల చేసే కోవిడ్ సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓ నమ్మటం లేదు. వాస్తవ సమాచారం విడుదలై తేనే 'ఒమిక్రాన్'ను అరికట్టడంలో ప్రణాళికలు సఫలం అవుతాయి. మరణాలను అడ్డుకోవచ్చు. భారత్‌లో జన గణన సమాచారాన్ని సేకరించేప్పుడు..కోవిడ్ మరణాలను కూడా నమోదు చేయాలని రిజిస్ట్రార్ జనరల్‌ను కోరుతున్నా.
- అంటువ్యాధుల నిపుణుడు
ప్రభాత్ ఝా, టొరొంటో