Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక సవాళ్ళకు పరిష్కారాలపై నేతల చర్చలు
జెనీవా : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను చర్చించేందుకు, కీలకమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రపంచ నేతలకు దావోస్ సమావేశం ఒక అవకాశాన్ని కల్పిస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. ఆన్లైన్లో జరిగే ఈ సమావేశాలు సోమవారం ఆరంభమయ్యాయి. కీలకమైన అంతర్జాతీయ భాగస్వాములు సంఘటిత కృషి చేపట్టే దిశగా ఈ సమావేశం దృష్టి కేంద్రీకరించనుందనిడబ్ల్యూఈఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండేండ్లుగా నెలకొన్న కోవిడ్ మహమ్మారి, నాల్గవ పారిశ్రామిక విప్లవం, ఇంధన పరివర్తన, వాతావరణ సంక్షోభం, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ ఆర్థిక దృక్పథం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. వాతావరణ మార్పులు, అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్లు అందేలా చూడడం వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. కోవిడ్ మహమ్మారి, దాని తాలుకూ పర్యవసానాలు, వాటి కారణంగా తలెత్తిన సంక్షోభం అంతా నెమ్మదిగా ఈ ఏడాది తగ్గుముఖం పడుతుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ క్లాస్ షావాబ్ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నుంచి విశ్వాస పునరుద్ధరణ చర్యల వరకు పలు ప్రధానమైన అంతర్జాతీయ సవాళ్లు మనముందున్నాయని అన్నారు. వాటిని పరిష్కరించాలంటే, నేతలందరూ కొత్త నమూనాలను ఆమోదించి, అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరించాలని, సహకారాన్ని పునరుద్ధరించుకుని, వ్యవస్థాగతంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధాన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి : జిన్‌పింగ్
ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని ఏ విధంగా ఎదుర్కొనాలి, కోవిడ్ అనంతర ప్రపంచాన్ని ఎలా నిర్మించాలనే ప్రధాన, అత్యవసర ప్రశ్నలకు ఈ సమావేశాల్లో సమాధానాలు దొరకాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలివేనని అన్నారు. డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో జిన్‌పింగ్ ప్రసంగించారు. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని రీతిలో ఈనాడు ప్రపంచం ప్రధాన మార్పులకు లోనవుతోందని అన్నారు. ఈ మార్పులనేవి కేవలం ఒక దేశానికి, లేదా ప్రాంతానికి, నిర్దిష్ట కాలానికి పరిమితం కాలేదని, అంత ర్జాతీయంగా పెనుమార్పులు సంభవిస్తున్నాయని అన్నారు. శతాబ్ద కాలం లో ఒకసారి ఇటువంటి పెనుమార్పులు సంభవించినపుడు ఈ కల్లోలిత, పరివర్తనా కాలంలో ప్రపంచం తనను తాను కనుగొంటుందని అన్నారు.
భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైనసమయం : మోడీ
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనుకూల సమయమని ప్రధాని మోడీ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోడీ.. 'స్టేట్ ఆఫ్ ద వరల్డ్' అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులకు భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు తీసుకున్న పలు చర్యలను వివరించారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎంతో ఉత్సుకతతో ఉందన్నారు. 'మీ వ్యాపారాలను, ఆలోచనలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు'ని తెలిపారు. 2014 నాటికి కేవలం వందల సంఖ్యలోనే ఉన్న స్టార్టప్‌లు ప్రస్తుతం 60వేలకు దాటిందన్నారు. గత ఆరు నెలల్లోనే 10వేల స్టార్టప్‌లు ప్రపంచస్థాయి నైపుణ్యాలతో నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో 50లక్షలకు పైగా సాఫ్ట్వేర్ డెవలపర్లు పనిచేస్తున్నారని తెలిపారు.