Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మృతి
అబుదాబి : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి ఎయిర్పోర్ట్ సమీపంలోని ముసఫ్పా పారిశ్రామికవాడపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మరణించగా, ఎనిమిదిమందికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఇద్దరు భారతీయులు మరణించినట్టు ఇక్కడి అధికారులు తెలిపారనీ, వారిని గుర్తించేందుకు యత్నిస్తున్నామనీ భారత రాయబారి సంజరు సుధీర్ తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఇరాన్ మద్దతున్న యెమెన్ హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులు జరిపినట్టు సమాచారం. ఈ దాడిలో మూడు పెట్రోల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దాడుల కారణంగా ఎయిర్పోర్ట్లో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో మంటలు చెలరేగాయనీ, దీంతో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ హౌతీ ఉగ్రవాదులు ప్రకటించారు. యెమెన్లో ఇరాన్ అనుకూల హౌతీ ఉగ్రవాదులతో 2015 నుంచి సౌదీ నేతృత్వంలో యూఏఈ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీతో పాటు యూఏఈని కూడా హౌతీ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల యూఏఈ నౌకను హౌతీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యను ఐరాస భద్రతా మండలి ఖండించింది.