Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూయార్క్ టైమ్స్ వెల్లడి
మాస్కో : ఉక్రెయిన్‌తో గల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో కీవ్‌లోని తమ ఎంబసీ నుండి, లొవోవ్లోని కాన్సులేట్ నుండి దౌత్యవేత్తలను, వారి కుటుంబాలను ఉపసంహరించడం రష్యా ప్రారంభించిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ మేరకు పేరు వెల్లడించని అధికారులను ఉటంకిస్తూ పత్రిక సోమవారం వివరాలు ప్రచురించింది. జనవరి 5న మొత్తంగా 18మంది ఉక్రెయిన్ వీడారని పత్రిక తెలిపింది. అందులో ప్రధానంగా రష్యన్ దౌత్యవేత్తల భార్యలు, వారి పిల్లలు వున్నారని పేర్కొంది. ఆ తర్వాత రెండు వారాల్లో మరో 30మంది రానున్నారు. తర్వాత మరో రెండు రష్యన్ కాన్సులేట్ల (ఖర్కోవ్, ఒడెస్సా) కి చెందిన దౌత్యవేత్తలు దేశాన్ని వీడేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. దీనిపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, కీవ్‌లోని రష్యన్ ఎంబసీ సాధారణంగానే పనిచేస్తోందని చెప్పారు. అయితే సిబ్బందిని తగ్గించారనడాన్ని తిరస్కరించలేదు. రష్యన్ దౌత్యవేత్తలు దేశం విడిచి వెళుతున్నారని అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. రాబోయే కాలంలో ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా సన్నాహాలు చేస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అందుకోసమే సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తోందంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని రష్యా ప్రతీసారీ ఖండిస్తూనే వస్తోంది. తమకు దాడి చేసే ఉద్దేశ్యం లేదని చెబుతునే వుంది. రష్యా దాడులు జరుపుతుందనే సాకుతో నాటో ఆ ప్రాంతంలో బలగాలను మోహరిస్తోందని క్రెమ్లిన్ విమర్శిస్తోంది. కాగా, పట్టణప్రాంతాల్లో యుద్ధం జరపడంలో ఆరితేరిన, పేలుడు పదార్ధాలను వినియోగించడంలో సుశిక్షితులైన కొంతమందిని రష్యా తన స్వంత ప్రాక్సీ బలగాలకు వ్యతిరేకంగా విద్రోహ చర్యలు చేపట్టేందుకు పంపినట్లు గత వారం అమెరికాకి చెందిన సిఎన్ఎన్ తెలిపింది. ఉక్రెయిన్‌లో సైనిక జోక్యానికి ఒక సాకును సృష్టించడానికే ఇదంతా చేస్తోందని పేర్కొంది.