Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోంగా అగ్నిపర్వత విస్ఫోటనంతో పలు దేశాల్లో సునామీ ఆందోళనలు
- టోంగాకు సాయం చేయడానికి ముందుకొచ్చిన దేశాలు
సువా : టోంగా సముద్రంలో భారీగా సంభవించిన అగ్నిపర్వత విస్ఫోటనం, దాని ఫలితంగా ఆ దేశంతో పాటు పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సర్వత్రా ఆందోళనలు పెరుగుతున్నాయి. సమీపంలోని పలు దేశాల్లో సముద్ర నీటి మట్టాలు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. టోంగాకు ఇతర ప్రపంచంతో కమ్యూనికేషన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో ఇంతవరకు ఈ కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారమందలేదు. మరోవైపు అగ్ని పర్వతం నుండి విస్ఫోటనాలు కొనసాగుతుండడంతో అక్కడ వాతావరణ పరిస్థితులు, ఆ ప్రభావంతో చుట్టుపక్కల వాతావరణంలో నెలకొనే ప్రభావాల పట్ల పలు దేశాలు ఆందోళనలు వెలిబుచ్చుతున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న టోంగాకు సాయం చేయడానికి కూడా ముందుకొచ్చాయి. శుక్రవారం సంభవించిన విస్ఫోటనం 12గంటలకు పైగా సాగింది., శనివారం మరి కొద్దిసేపు మండిందని, దాంతో పెద్ద మొత్తంలో బూడిద, పొగ ఆకాశంలోకి చిమ్మిందని టోంగా వార్తా వెబ్సైట్ మాతంగి టోంగా ఆన్లైన్ తెలిపింది. గతేడాది డిసెంబరు 20న సంభవించిన విస్పోటనం కన్నా దీని తీవ్రత ఏడు రెట్లు ఎక్కువ అని టోంగా జియోలాజికల్ సర్వీసెస్ హెడ్ తెలిపారు. విస్ఫోటనం తీవ్రత కారణంగా వాతావరణ పీడనంలో మార్పులు చోటు చేసుకున్నాయని, వాటి ప్రభావం జపాన్ వరకు చేరిందని జపాన్ వార్తా పత్రిక వ్యాఖ్యానించింది. ఇంకా విస్ఫోటనాలు తలెత్తే అవకాశాలు వున్నాయా లేదా, వాతావరణంపై వాటి ప్రభావం ఎలా వుంటుందనే ఇప్పుడే ఏం చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైతే టోంగాకు సాయం చేయడానికి సిద్ధగా వున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆదివారం తెలిపారు. న్యూజిలాండ్ ప్రదాని జసిండా ఆర్డర్న్ కూడా ఇదే విషయమై ఆదివారం హామీ ఇచ్చారు.