Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాదీ అంతంతే..
- ఆర్థిక పునరుద్ధరణపై అంచనాలు విడుదల చేసిన ఐఎల్ఓ
- కరోనా ప్రభావంతో క్షీణించిన లేబర్ మార్కెట్
న్యూయార్క్ : ప్రస్తుతం కోవిడ్ మహమ్మారితో అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు రాబోయే సంవత్సరంలో కూడా పూర్తిస్థాయిలో కోలుకోలేవని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అంచనా వేసింది. కోవిడ్ ప్రభావం కారణంగా ఈ ఏడాదిలో కూడా పనిగంటల లోటు వుంటుందని పేర్కొంది. ఆ లోటు 2022లో 5కోట్ల 20లక్షల ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానంగా వుంటుందని తెలిపింది. కోవిడ్ ప్రభావాన్ని అంచనా వేస్తూ ఇటీవల ఐఎల్ఓ ఒక నివేదికను విడుదల చేసింది. 2022లో లేబర్ మార్కెట్ కోలుకునే అంచనాలను తగ్గించింది. కరోనా ముందు కాలం నాటి స్థాయితో పోలిస్తే, 2022లో అంతర్జాతీయంగా పనిగంటలు దాదాపు 2శాతం తక్కువగా వుంటాయని తెలిపింది. ఈ కాలంలో పెరిగిన జనాభాను కూడా దృష్టిలో వుంచుకునే ఈ అంచనాలు రూపొందాయి. గత ఐఎల్ఓ అంచనాల తర్వాత అంతర్జాతీయ లేబర్ మార్కెట్ పనితీరు క్షీణించిందని ఆ నివేదిక పేర్కొంది. కనీసం రాబోయే సంవత్సరాల్లోనైనా కరోనాకు ముందు కాలం నాటి స్థాయికి పునరుద్ధరణ వుంటుందనేది చాలా దేశాలకు కేవలం భ్రమగానే మిగిలిపోగలదని ఆ నివేదిక హెచ్చరించింది. ఐఎల్ఓ ప్రపంచ ఉపాధి, సామాజిక దృక్పథం ధోరణులు, 2022 శీర్షికతో ఈ నివేదిక వెలువడింది. 2021 జూన్లో వెలువడిన నివేదిక ప్రకారం 2022లో పనిగంటల లోటు దాదాపు ఒక శాతం కన్నా తక్కువగానే వుంటుందని అంచనా వేసింది. కానీ ఊహించిన దాని కన్నా రెట్టింపు పెరిగింది. సంపన్న దేశాలు కరోనా ప్రభావాలను అధిగమించి, తమ ఉపాధులను, ఆదాయ నష్టాలను భర్తీ చేసుకోగలుగుతున్నాయని, కానీ వర్ధమాన, నిరుపేద దేశాలు మాత్రం ఇంకా ఆ మహమ్మారి ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నాయని ఐఎల్ఓ పేర్కొంది. పైగా 2022లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం 20.7కోట్ల మేరకు వుండగలదని అంచనా వేశారు. 2019తో పోలిస్తే దాదాపు 2.1కోట్ల నిరుద్యోగులు పెరిగారు. 2023లో కూడా ఇదే పరిస్థితి వుంటుందని భావిస్తున్నారు. కరోనాకు ముందు కాలానికి ఈ రికవరీ రావాలంటే ఇంకా కొంచెం సమయం పడుతుందని పేర్కొంది. ఫలితంగా ఉపాధిలో, పనిగంటల్లో వృద్ధి మందగిస్తుందని పేర్కొంది.