Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్ : ఉక్రెయిన్ ప్రత్యేక బలగాలకు అమెరికా శిక్షణ ఇస్తోంది. ఈ మేరకు యాహూ పోర్టల్ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ), నేషనల్ సెక్యూరిటీ మాజీ సభ్యులు, ఉక్రెయిన్ ప్రత్యేక బలగాలకు రహస్యంగా శిక్షణ ఇస్తున్నాయని ఆ కథనం పేర్కొంది. ఉక్రెయిన్‌లో రహస్యంగా సాగుతున్న ప్రత్యేక బలగాల శిక్షణా కార్యక్రమానికి సిఐఎ ఇన్చార్జిగా వుందని ఆ బలగాల సభ్యులే యాహూ పోర్టల్‌కు తెలిపారు. కాగా, 2015లో బారక్ ఒబామా హయాంలోనే అమెరికాలో ఈ శిక్షణా ప్రణాళిక ప్రారంభమైందని, తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో కొనసాగుతోందని రష్యా టుడే సోమవారం పేర్కొంది. సిఐఎతో కలిసి పనిచేస్తున్న పేరా మిలటరీ బలగాలు 2015లోనే చర్చల నిమిత్తం తూర్పు ఉక్రెయిన్ను సందర్శించాయని ఆ వర్గాలు తెలిపాయి. ఆయుధాలు ఉపయోగించడం, మభ్యపెట్టే సాంకేతికతలను వినియోగించడం, నావిగేషన్, ఇంటెలిజెన్స్, ఇతర రంగాల్లో ఈ శిక్షణ కొనసాగుతోంది. పలు వారాల పాటు కొనసాగే ఈ శిక్షణ, డేటాను సమీకరించడంలో సాయపడేందుకు ఉద్దేశించబడిందని అమెరికా సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారు. అయితే ఒకవేళ రష్యా దాడి జరిపిన పక్షంలో రష్యా సైనిక బలగాలను ప్రతిఘటించేందుకు గానూ ఉక్రెయిన్ బలగాల సామర్ధ్యాన్ని మెరుగుపరచడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యంగా వుందని పేరు చెప్పడానికి వెల్లడించని సీనియర్ అధికారి తెలిపారు. రష్యన్లను ఎలా చంపాలనేది ఉక్రెయిన్ మిలటరీకి బోధించడమే ఈ శిక్షణ ఉద్దేశ్యమని మరో సిఐఎ అధికారి చెప్పారు. ఎనిమిదేళ్ళుగా శిక్షణ సాగుతున్నందున వారు మంచి పోరాట యోధులుగా తయారయ్యారని మరో ఇంటర్వ్యూలో సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.