Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాకు రష్యా సూచన
మాస్కో, కీవ్ : ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను అందచేయాలన్న ఆలోచనలను మానుకోవాల్సిందిగా అమెరికాను రష్యా కోరింది. పెచ్చరిల్లుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను పరిష్కరించుకోవడానికి దౌత్య మార్గాలను ఉపయోగించుకోవాలని కోరింది. ఉక్రెయిన్‌కు గత వారంలోనే 20కోట్ల డాలర్ల మేరకు అదనపు సైనిక సాయాన్ని అమెరికా ఆమోదించింది. దీనివల్లే ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జకరోవా అన్నారు. ఉక్రెయిన్‌లోని అంతర్గత ఘర్షణలను పరిష్కరించడానికి అమెరికా నిజంగా దౌత్య పరిష్కారాలకు కట్టుబడినట్లైతే, ఇలా ఆయుధాలు సరపరా చేయడాన్ని మానుకోవాలని కోరారు. అందుకు బదులుగా మిన్క్స్ ఒప్పందాలకు కట్టుబడేలా ఉక్రెయిన్ను ఒప్పించేందుకు అమెరికా తన అధికారాన్ని ఉపయోగించాలని సూచించారు. ఉక్రెయిన్‌కు సంబంధించి తమను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడాన్ని మానుకోవాలని పిలుపిచ్చారు. డాన్బాస్ సమస్య చుట్టూ ఇంకా ఉద్రిక్తతలు పెంచుకుంటూ వెళ్ళవద్దని స్పష్టం చేశారు. తమకు దాడి చేసే ఉద్దేశ్యమే లేదని, అమెరికా ఊరికే దీనిపై గొంతు చించుకుని ఆరుస్తోందని విమర్శించారు.
భద్రతా పరిస్థితులపై జెలెన్స్కీ, బ్లింకెన్ చర్చలు
ఉక్రెయిన్ చుట్టుపక్కల నెలకొన్న భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు బుధవారం సమావేశమయ్యారు. ప్రస్తుతమున్న చర్చల పరిధిలోను, ఇతర రాజకీయ, దౌత్య పరిష్కార ఫార్మాట్‌ల్లోనూ పరిస్థితులను పరిష్కరించేందుకు గల మార్గాలపై ఉభయ పక్షాలు తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాయి. అన్ని రకాల చర్చల ఫార్మాట్‌ల్లోనూ ఈ కసరత్తును ముమ్మరం చేయాలని భావిస్తున్నామని, తద్వారా నార్మండీ సదస్సు (డాన్బాస్ ఘర్షణలను అంతమొందించేందుకు ఉద్దేశించిన సదస్సు)కు మార్గం సుగమం చేస్తామని జెలెన్స్కీ చెప్పారు. ఘర్షణలతో అట్టుడికి పోతున్న డాన్బాస్ ప్రాంతంలో ఈ వారంలో కాల్పుల విరమణ పాటించామని, ఉక్రెయిన్ సైనికుడెవరూ కూడా మరణించలేదని జెలెన్స్కీ, బ్లింకెన్‌కు తెలియచేశారు. తమ సైన్యాన్ని ఆధునీకరించడానికి అమెరికా సాయం కావాలని ఉక్రెయిన్ నేత కోరారు. యూరో-అట్లాంటిక్ భాగస్వామ్యంపై ఉక్రెయిన్‌కు గల ఆకాంక్షలకు అమెరికా మద్దతివ్వగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. గతవారం జెనీవాలో రష్యాతో జరిగిన సమావేశం గురించి జెలెన్స్కీకి తెలియచేసినట్లు చర్చల అనంతరం బ్లింకెన్ ట్విట్టర్లో తెలిపారు. ఉక్రెయిన్ లేకుండా ఉక్రెయిన్ గురించి మాట్లాడేదేమీ వుండదని పేర్కొన్నారు.