Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ ముప్పుపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ స్పష్టీకరణ
జెనీవా : కోవిడ్ మహమ్మారి ముప్పు ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ వల్ల పెద్దగా ముప్పేమీ లేదన్న భావన సరికాదని, అందరూ అప్రమత్తంగానే వుండాల్సిన అవసరం వుందని హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో ఈ మహమ్మారి అంతమొందుతుందని భావించలేమని టెడ్రోస్ అదనామ్ గెబ్రెయెసెస్ విలేకర్లతో వ్యాఖ్యానించారు. గత నవంబరులో ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలిసారిగా దక్షిణాఫ్రికాలో కనుగొన్నప్పటి నుంచి ఈ వేరియంట్ అంత ప్రమాదకారి కాదనే భావన అంతర్జాతీయంగా నెలకొందని, ఇది సరికాదని హెచ్చరించారు. గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా తక్కువ ముప్పు కలిగిస్తుండడంతో కరోనా మహమ్మారి ఆ స్థాయి నుండి స్థానికంగా వ్యాప్తి చెందే అంటువ్యాధిగా (ఎండెమిక్) మారుతోందా, ఇక దాంతో కలిసి జీవించే పరిస్థితులు నెలకొంటాయా అనే అంశంపై ప్రసుత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే ఈ వైరస్ సోకుతున్న తీరు చూస్తుంటే అలా ఉదాసీనంగా వుండేందుకు అస్సలు అవకాశం లేదని, ఇంకా చాలా మంది తీవ్రంగా అస్వస్థతకు గురై, చనిపోతున్నారని తెలిపారు. అసాధారణ రీతిలో కేసులు పెరగడంతో అనివార్యంగానే అస్పత్రుల్లో చేరికలు, మరణాలు కూడా పెరుగుతాయని డబ్ల్యుహెచ్ఓ ఎమర్జన్సీస్ డైరెక్టర్ మైఖేల్ రియాన్ పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.